ట్రంప్ అధ్యక్ష పీఠం వదిలేందుకు ఇష్టపడకపోవడానికి ఐదు కారణాలు... ఇవేనా?

15-11-2020 Sun 19:50
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమి
  • గెలుపు తనదే అంటున్న వైనం
  • జనవరి నాటికి అధికార బదలాయింపు
  • ససేమిరా అంటున్న ట్రంప్!
What happens if Donald Trump quits as president

అమెరికా చరిత్రలో డొనాల్డ్ ట్రంప్ వంటి అధ్యక్షుడు మరొకరు లేరు... ఇది అందరూ అంగీకరించే మాట. ఇప్పటివరకు అమెరికాను పాలించిన వారిలో చెత్త అధ్యక్షుల జాబితాలో ట్రంప్ కు అగ్రస్థానం ఇవ్వొచ్చన్న వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. అమెరికా చరిత్రలో దారుణమైన అధ్యక్షులుగా పేరుపొందిన రిచర్డ్ నిక్సన్ (1969-74), వారెన్ హార్డింగ్ (1921-23), ఆండ్రూ జాన్సన్ (1965-69) ల కంటే ట్రంప్ ఒక మెట్టుపైనే ఉంటారని విశ్లేషకులు అంటున్నారు.

ఎన్నికల్లో ఓడినా గెలుపు తనదే అనడం ట్రంప్ కే చెల్లింది. 2021 జనవరి లోపు జో బైడెన్ కు అధికార బదిలీ చేయాల్సి ఉండగా,  న్యాయపోరాటాలు చేసైనా అధ్యక్ష పీఠాన్ని నిలుపుకుంటానని ట్రంప్ చెప్పడం అమెరికా రాజకీయ పండితులకు సైతం విసుగెత్తిస్తోంది. అయితే, ఆయన అధ్యక్ష పీఠాన్ని అంటిపెట్టుకుని ఉండడం వెనుక ఐదు బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అవేంటో చూద్దాం!

1. ఒక్కసారి అధ్యక్ష పీఠం నుంచి దిగిపోయాడంటే ట్రంప్ ను కోర్టు కేసులు చుట్టుముడతాయి. సిట్టింగ్ ప్రెసిడెంట్ ను కోర్టు కేసులేమీ చేయలేవని, దేశాధ్యక్షుడిపై క్రిమినల్ అభియోగాలు మోపలేరని చెబుతున్న ట్రంప్ ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సి రావొచ్చు. అధ్యక్షుడి కార్యకలాపాలకు ఈ కోర్టు కేసులు, విచారణ భంగం కలిగిస్తాయని తన అటార్నీ జనరల్ విలియం బార్ సాయంతో కేసులను తిప్పికొట్టే అవకాశాన్ని కోల్పోతారు. అధికారం లేక, చేతిలో విలియం బార్ వంటి అటార్నీ జనరల్ లేకపోతే పోర్న్ స్టార్ కేసుతో, అత్యాచార ఆరోపణలు, పరువునష్టం కేసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉంది. ఆయనపై ఇప్పటివరకు 26 మంది మహిళలు ఆరోపణలు చేశారు. స్వయంగా బంధువు మేరీ ట్రంప్ కూడా ఆయనపై దావా వేయడం గమనార్హం.

2. ట్రంప్ ప్రధానంగా వ్యాపారవేత్త అని తెలిసిందే. రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు చేసే ట్రంప్ కు వ్యక్తిగతంగా 400 మిలియన్ డాలర్ల మేర అప్పులున్నాయని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. ఒక్కసారి అధ్యక్ష పదవి నుంచి తప్పుకుని వైట్ హౌస్ వెలుపలికి వస్తే ట్రంప్ దివాలా కోరల్లో చిక్కుకోవడం తథ్యం! భారీ నష్టాల్లో కూరుకుపోయిన కొన్ని సంస్థల రుణాలకు సంబంధించి వ్యక్తిగతంగా ఆయనే బాధ్యుడు మరి!

 ఇక, ఆయన వ్యాపార సంస్థలు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే అధ్యక్షుడు ట్రంప్ అనే బ్రాండ్ ఇప్పటిదాకా బాగా ఉపయోగపడింది. అదే మాజీ అయితే, గతంలో మాదిరి తన సంస్థల కోసం భారీ బిజినెస్ డీల్స్ కుదుర్చుకోలేకపోవచ్చు. భారత్ వంటి దేశాల్లోనూ ట్రంప్, ఆయన సంతానం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారంటే అధ్యక్షుడు అనే బ్రాండ్ నేమ్ వల్లే.

3. అమెరికా అధ్యక్షుడయ్యాక ట్రంప్ ఆదాయ, వ్యయాలపై సరైన స్పష్టతలేదు. ఇప్పటివరకు అమెరికా న్యాయవిభాగాన్ని తన సొంత న్యాయ వ్యవస్థలా మార్చుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రంప్, ఆ ఆరోపణలు నిజమే అనిపించేలా, ఎన్నికల ముందు కూడా తన ఆదాయ రిటర్నులు వెల్లడించకుండా సమర్థంగా నెట్టుకొచ్చారు. అయితే, అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటే మాత్రం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా తన ఆదాయ రిటర్నులు వెల్లడించక తప్పదు. ట్రంప్ దేశీయ, విదేశీ పెట్టుబడులు, ఎంత మేర సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు చేస్తున్నాడు, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి అనే విషయాలన్నీ బయటికి వస్తాయి.

4. ట్రంప్ వ్యాపారవేత్త మాత్రమే కాదు, గతంలో ఆయన టెలివిజన్ ప్రజెంటర్ గా కూడా పనిచేశారు. కెమెరా ఫోకస్, ప్రజల దృష్టి తనపైనే ఉండాలని కోరుకునే వ్యక్తి ఆయన. అధ్యక్ష భవనంలో ఉన్నన్ని రోజులు తన మనోభావాలకు అనుగుణంగా అందరినీ శాసించగలిగారు. తనపై అందరి దృష్టిని తిప్పుకోగలిగారు. తనకు నచ్చని మీడియాను, వ్యక్తులను ఓ రేంజిలో ఏకిపారేశారు.

అయితే, మాజీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు గత వైభవం ఎంతమాత్రం సాధ్యం కాదు. సొంత మీడియా సంస్థగా పేర్కొనే ఫాక్స్ న్యూస్ కూడా ఆయనకు నమ్మకద్రోహం చేసిందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. అన్ని మీడియా సంస్థల్లాగే ఫాక్స్ న్యూస్ కూడా జో బైడెన్ గెలిచినట్టు ప్రకటించింది. ముఖ్యంగా, ఇకపై ట్రంప్ కు సోషల్ మీడియాలో అన్ ఫాలో బెడద తప్పదని వాషింగ్టన్ పోస్ట్ మీడియా సంస్థ చెబుతోంది. ట్రంప్ కు ట్విట్టర్ లో 88 మిలియన్ల మంది, ఫేస్ బుక్ లో 31 మిలియన్లు, ఇన్ స్టాగ్రామ్ లో 23 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ట్రంప్ మాజీ అయితే వారందరూ ఆయనను  అనుసరిస్తారా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.

5. ట్రంప్ అహంకారి!... ఇది ఆయన రాజకీయ ప్రత్యర్థి జో బైడెన్ నుంచి అనేకమంది నేతలు చెప్పేమాట. ఓటమిని ఏమాత్రం అంగీకరించని తత్వాన్ని నరనరానా జీర్ణించుకున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల పరాభవాన్ని భరించలేడని విమర్శకులు అంటున్నారు. పరాజితుడు అనే ముద్రను ఆయన తట్టుకోలేరని చెబుతున్నారు. ఓవైపు ప్రజలు ప్రాణాంతక కరోనాతో సతమతమవుతున్నా ట్రంప్ మాత్రం ఎన్నికల్లో రిగ్గింగ్, మోసాలు అంటూ ఎలుగెత్తడం ఈ కోవలోకే వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ లక్షణమేమీ ట్రంప్ కొని తెచ్చుకున్నది కాదు, ఆయన తండ్రి ఫ్రెడ్ నుంచి వారసత్వంగా వచ్చిందేనట. ఫ్రెడ్ కూడా ఓటమిని ఏమాత్రం సహించేవాడు కాదని, తన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పరాజితులు ఉన్నా వారి పట్ల ఆయన వ్యవహరించే తీరు వేరేగా ఉంటుందని ట్రంప్ బంధువు మేరీ ట్రంప్ తన పుస్తకంలో పేర్కొన్నారు.