వ్యాక్సిన్ వచ్చినా.. న్యూయార్క్‌ ప్రజలకు అంత త్వరగా అందదు: ట్రంప్

15-11-2020 Sun 12:27
  • గవర్నర్ ఆండ్రూ క్యూమోనే అందుకు కారణం
  • ఏప్రిల్ నాటికి అమెరికా ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్
  • దాని సామర్ధ్యంపై ఆండ్రూ క్యూమోకు భయం
  • అందుకే వ్యాక్సిన్ ను న్యూయార్క్ ప్రజలకు పంపిణీ చేయరు
newyork people cant get vaccine trump

అమెరికాలో అభివృద్ధి చేస్తోన్న వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ  న్యూయార్క్ రాష్ట్రానికి మాత్రం అంత త్వరగా వ్యాక్సిన్ అందకపోవచ్చని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యూమోనే అందుకు కారణమని  ఆరోపణలు గుప్పించారు. 

 తాజాగా శ్వేతసౌధంలో మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ... వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అమెరికా ప్రజలకు ఫైజర్ వ్యాక్సిన్ అందుతుందని చెప్పారు. ఇదే సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తిలో పాలుపంచుకున్న అమెరికా ఔషధ సంస్థల సామర్ధ్యంపై ఆండ్రూ క్యూమో భయపడుతున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అందుకే ఆ వ్యాక్సిన్ ను వెంటనే న్యూయార్క్ ప్రజలకు పంపిణీ చేయకుండా ఆయన పరిపాలన విభాగం అడ్డుకునే అవకాశం ఉందని అన్నారు.

ఈ విషయాన్ని న్యూయార్క్ ప్రజలకు చెప్పడానికి తాము ఎంతగానో చింతిస్తున్నామని తెలిపారు. గవర్నర్ కు టీకా సామర్థ్యంపై నమ్మకం లేదని చెప్పారు. ఈ విషయంపై గర్నవర్ ఓ నిర్ణయానికి రావాలని, అలాగయితేనే వ్యాక్సిన్ త్వరగా అందించడానికి మార్గం సుగమమవుతుందని చెప్పారు. అమెరికాలో కరోనా వైరస్ మరోసారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. రోజుకి లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి.