Rahul Dravid: ఒలింపిక్స్ లో క్రికెట్ కూడా ఉండాలి: రాహుల్ ద్రావిడ్

Rahul Dravid votes for cricket inclusion in Olympics
  • ఎప్పట్నించో చర్చనీయాంశంగా ఉన్న ఒలింపిక్స్ లో క్రికెట్ అంశం
  • ఒలింపిక్స్ లో క్రికెట్ ఉంటే ఎంతో లాభదాయకమన్న ద్రావిడ్
  • క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని వెల్లడి
ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం అయిన ఒలింపిక్స్ లో క్రికెట్ వంటి ప్రజాదరణ కలిగిన ఆటకు కూడా స్థానం ఉండాలని భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలన్న వాదనకు తాను మద్దతిస్తానని తెలిపారు. ఒలింపిక్స్ లో టీ20 ఫార్మాట్ ను ప్రవేశపెడితే అది క్రికెట్ కు ఎంతో లాభదాయకమని అన్నారు. టీ20 క్రికెట్ ఆడే దేశాల సంఖ్య 75 అని వెల్లడించిన ద్రావిడ్, ఒలింపిక్ క్రీడగా క్రికెట్ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు.

అయితే ఇందులో కూడా కొన్ని సవాళ్లు లేకపోలేదని, క్రికెట్ మ్యాచ్ లు రక్తి కట్టాలంటే అనేక ఏర్పాట్లు, సదుపాయాలు అవసరమని పేర్కొన్నారు. ఐపీఎల్ సక్సెస్ అయిందంటే అందుకు కారణం నాణ్యమైన పిచ్ లేనని తెలిపారు. మెరుగైన క్రికెట్ సదుపాయాలు, స్పోర్టివ్ వికెట్లు అందుబాటులో ఉంటే ఒలింపిక్స్ లో క్రికెట్ ఎందుకు ప్రజాదరణ పొందదు? అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, క్రికెట్ ఒలింపిక్స్ లో ప్రవేశించేందుకు మరికొంత సమయం పడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

కాగా, క్రికెట్ ను ఒలింపిక్ క్రీడగా చేసేందుకు గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. 2018లో ఐసీసీ సర్వే నిర్వహించగా, 87 శాతం మంది ఒలింపిక్స్ లో క్రికెట్ ఆటను చేర్చేందుకు మద్దతు పలికారు. 2010, 2014లో ఆసియా క్రీడల్లో క్రికెట్ ను చేర్చినా బీసీసీఐ మాత్రం టీమిండియాను పంపలేదు.
Rahul Dravid
Cricket
Olympics
T20
IPL

More Telugu News