Narendra Modi: దీపావళి ప్రసంగంలో చైనా, పాకిస్థాన్ లకు ఘాటు హెచ్చరికలు చేసిన మోదీ

  • సరిహద్దుల వద్ద మనల్ని పరీక్షించాలనుకునేవారికి దిమ్మతిరిగే సమాధానం ఇస్తాం
  • విస్తరణవాదులు ఇప్పటికీ 18వ శతాబ్దంలో ఉన్నారు
  • మన సైనిక శక్తిని ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదు
PM Modi Slams China In Diwali Speech

సరిహద్దుల వద్ద మనల్ని ఎవరైనా పరీక్షించాలని చూస్తే... దిమ్మతిరిగే సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. చైనా, పాకిస్థాన్ లతో నెలకొన్న ఉద్రక్తతల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ఆ రెండు దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఉన్న వ్యూహాత్మక లాంగేవాలా పోస్టులో సైనికులతో  కలిసి మోదీ దీపావళి జరుపుకున్నారు. ఈ సందర్భంగా సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

విస్తరణవాద శక్తులతో యావత్ ప్రపంచం ఇబ్బంది పడుతోందని మోదీ అన్నారు. ఇదొక మానసిక వ్యాధి అని విమర్శించారు. విస్తరణవాదులు ఇప్పటికీ 18వ శతాబ్దపు భావజాలంతో ఉన్నారని దుయ్యబట్టారు. ఇలాంటి శక్తులను ఎదుర్కోవడంలో మన వ్యూహం స్పష్టంగా ఉందని చెప్పారు. ఇతర దేశాలను మనం అర్థం చేసుకోవడం, మన భావజాలాన్ని ఇతరులు అర్థం చేసుకోవాలనేది ఇండియా పాలసీ అని అన్నారు. ఇదే సమయంలో మనల్ని ఎవరైనా పరీక్షిస్తే మాత్రం భారత్ దీటైన జవాబును ఇస్తుందని చెప్పారు.

భారత్ కు పలు దేశాలతో పొడమైన సరిహద్దులు ఉన్నాయని... అయితే, ప్రతి భారతీయుడికి తెలిసిన పోస్ట్ లాంగేవాలా అని మోదీ అన్నారు. జవాన్ల పరాక్రమం గురించి మాట్లాడుకున్న ప్రతిసారి లాంగేవాలా యుద్ధం గుర్తొస్తుందని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయులను కాపాడుకోవడానికి దేశ రక్షణ కోసం పాటుపడుతున్న జవాన్లు అండగా ఉన్నారని అన్నారు. మీతో (సైనికులతో) ఎంత ఎక్కువ సమయం గడిపితే... అంత ఎక్కువగా దేశానికి సేవ చేయాలనే తపన, ఆకాంక్ష బలపడుతుందని చెప్పారు.

మన సైనిక శక్తిని ప్రపంచంలోని ఏ శక్తి అడ్డుకోలేదని మోదీ అన్నారు. జవాన్లు  అందరూ యోగా చేయాలని సూచించారు. మాతృభాష, ఇంగ్లీషుతో పాటు మరో భాషను కూడా నేర్చుకోవాలని అన్నారు. ఇది జవాన్లలో ఉత్సాహాన్ని మరింత పెంచుతుందని తెలిపారు.

More Telugu News