Bags: ఇంటిపై బ్యాగుల నిండా డబ్బు కట్టలు, బంగారం... కంగారుపడి పోలీసులకు సమాచారం అందించిన యజమాని!

House owner surprised after seen two bags filled with cash and jewellery
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ఉదయాన్నే లేచి ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి
  • రెండు బరువైన బ్యాగులు దర్శనం
  • పక్కింటి వాచ్ మన్ పనే అని తేల్చిన పోలీసులు
ఉదయాన్నే లేచి ఇంటిపైకి వెళ్లిన ఓ వ్యక్తి బ్యాగుల్లో డబ్బు కట్టలు, బంగారం దర్శనమివ్వడంతో దిగ్భ్రాంతికి గురైన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. మీరట్ లో నివసించే వరుణ్ శర్మ అనే వ్యక్తి ఉదయం నిద్రలేచి ఇంటిపైకి వెళ్లాడు. అయితే అక్కడ ఆయనకు రెండు బ్యాగులు దర్శనమిచ్చాయి. బాగా బరువుగా ఉండడంతో వాటిని తెరిచి చూడగా కరెన్సీ నోట్ల కట్టలు, బంగారం కనిపించాయి. అంత పెద్దమొత్తంలో డబ్బు, బంగారం తన ఇంటిపై ఉండడంతో వరుణ్ శర్మ కంగారుపడ్డాడు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపాడు.

పోలీసులు వచ్చి ఆ రెండు బ్యాగులను స్వాధీనం చేసుకుని, ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తులో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. వరుణ్ శర్మ ఇంటి పక్కనే ఉన్న భవనం పైనుంచి ఆ బ్యాగులను పడేసినట్టు గుర్తించారు.

ఆ భవనంలో పనిచేసే వాచ్ మన్ తన యజమానికి సంబంధించిన డబ్బు, బంగారం దోచుకుని బ్యాగుల్లో ఉంచి పక్కింటి డాబాపై పడేశాడు. తాను పనిచేస్తున్న ఇంటి గేటు నుంచి బ్యాగులను తీసుకెళితే సీసీ కెమెరాలకు దొరికిపోతానని భావించి, వాటిని పక్కింట్లో వేశాడు. దాంతో ఆ కాపలాదారును అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Bags
Cash
Jewellery
House
Meerut
Uttar Pradesh
Police

More Telugu News