West Bengal: బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై రాళ్లదాడి.. ఓటమి భయంతోనే అంటూ విరుచుకుపడ్డ బీజేపీ!

Bengal BJP president Dilip Ghoshs convoy attacked in Alipurduar
  • నల్లజెండాలతో నిరసన తెలిపి, వెనక్కి వెళ్లిపోవాలంటూ జీజేఎం నిరసన
  • రాళ్లదాడిలో పాక్షికంగా దెబ్బతిన్న వాహనం
  • రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఈ ఘటన మచ్చుతునకన్న ఘోష్
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వి, నల్ల జెండాలతో నిరసన తెలపడం కలకలం రేపింది. అలీపూర్దౌర్ జిల్లాలోని జైగావ్ ప్రాంతంలో జరిగిందీ ఘటన.

దిలీప్ ఘోష్ కాన్వాయ్ వస్తున్న విషయం తెలుసుకున్న గూర్ఖా జన్‌ముక్తి మోర్చా (జీజేఎం) కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌పై దాడికి దిగారు. ఘోష్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. జీజేఎం కార్యకర్తల రాళ్లదాడిలో ఘోష్ వాహనం పాక్షికంగా దెబ్బతిన్నట్టు నేతలు తెలిపారు. పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలను చెదరగొట్టడంతో ఘోష్ వాహనం ముందుకు కదిలింది.

ఘటన అనంతరం దిలీప్ ఘోష్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఎంసీ, దాని మిత్రులు ఇలాంటి పనికి పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే, ఇలాంటి ప్రయత్నాలు ఫలించబోవన్నారు. ప్రజలు తమవెంటే ఉన్నారన్న ఆయన.. ఈ దాడిని బట్టి రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు.
West Bengal
Dilip Ghosh
BJP
TMC
Mamata Banerjee

More Telugu News