Sunil Deodhar: ఎన్టీఆర్ రియల్ బాహుబలి, చంద్రబాబు ఓ కట్టప్ప: విమర్శనాస్త్రాలు సంధించిన సునీల్ దేవధర్

Sunil Deodhar describes NTR as Bahubali and Chandrababu as Kattappa
  • తిరుపతిలో బీజేపీ కార్యకర్తల సమావేశం
  • ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడంటూ వ్యాఖ్యలు
  • చంద్రబాబును మోసగాడిగా అభివర్ణించిన సునీల్ దేవధర్
తిరుపతిలో ఇవాళ జరిగిన బీజేపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావును 'నిజమైన బాహుబలి'గా అభివర్ణించారు. అదే సమయంలో ప్రస్తుత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును 'కట్టప్ప' అని పేర్కొన్నారు.

ఎంతో విశాల దృక్పథంతో, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, కానీ కొన్నాళ్లకే ఆ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడయ్యాడని సునీల్ దేవధర్ తెలిపారు. ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టాక కమీషన్ రాజ్ మొదలైందని విమర్శించారు. చంద్రబాబు ఓ మోసగాడు అని అన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీ రెండు కూడా కుటుంబ పార్టీలే అని, కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

అంతకుముందు ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను తాను గతంలో 'చిన్నమ్మా, చిన్నమ్మా' అని పిలిచేవాడ్నని, ఇవాళ ఆమె జాతీయస్థాయికి చేరి, బీజేపీలో పెద్ద పదవి చేపట్టి 'పెద్దమ్మ' అయిపోయారని అన్నారు. అందుకే ఆమెను తాను ఇప్పుడు 'పెద్దమ్మా' అని పిలుస్తున్నానని చమత్కరించారు. తాను మాత్రం ఏపీలో ఉండిపోయి 'చిన్నబాబు'ను అయిపోయానని సునీల్ దేవధర్ సరదాగా వ్యాఖ్యానించారు.
Sunil Deodhar
Chandrababu
Kattappa
NTR
Bahubali
Andhra Pradesh

More Telugu News