Joe Biden: మళ్లీ గ్యారేజిలోకి వెళ్లనున్న జో బైడెన్ కార్లు!

  • అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్
  • ఇకపై అధికారిక వాహనం బీస్ట్ లోనే ప్రయాణాలు
  • కార్లంటే బైడెన్ కు మోజు
  • దేశాధ్యక్షుడు డ్రైవింగ్ చేయడంపై సీక్రెట్ సర్వీస్ నిబంధన
Joe Biden cars will be back into garage

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ తండ్రి సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసేవారు. దాంతో సహజంగానే బైడెన్ కు కార్లంటే వ్యామోహం ఏర్పడింది. దాంతో యువకుడిగా ఉన్నప్పటి నుంచి అనేక కార్లను సేకరించారు. 50వ దశకం నాటి స్టూడ్ బేకర్, ప్లిమత్ కన్వర్టబుల్ కార్ల నుంచి షెవర్లే కార్వెట్టే కన్వర్టబుల్, మెర్సిడెస్ బెంజ్ (190 ఎస్ఎల్) కార్ల వరకు అనేక మోడళ్లు జో బైడెన్ గ్యారేజిలో ఉన్నాయి.

తన వద్ద ఉన్న అన్ని కార్లలోనూ షెవర్లే కన్వర్టబుల్ కారంటే బైడెన్ కు చాలా ఇష్టం. 1967లో బైడెన్ పెళ్లి సందర్భంగా ఆయన తండ్రి కానుకగా ఇచ్చిన కారది. అయితే, ఇప్పుడు ఆయన తన కార్లను స్వయంగా డ్రైవింగ్ చేయడం కుదరదు, వాటిలో ప్రయాణించడం, డ్రైవింగ్ చేయడం సీక్రెట్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధం.

ఎందుకంటే అమెరికా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు కేవలం అధికారిక వాహనాల్లోనే ప్రయాణించాలి. అధ్యక్షుడు అధికారిక వాహనం బీస్ట్ లోనే ప్రయాణించాల్సి ఉంటుంది. వారి భద్రత రీత్యా బీస్ట్ వంటి శత్రుదుర్భేద్యమైన వాహనమే సరి. దాంతో బైడెన్ వద్ద ఉన్న కార్లన్నీ గ్యారేజిలో విశ్రాంతి తీసుకోనున్నాయి.

గతంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలంలోనూ ఆయన తన కార్లకు విశ్రాంతి ప్రకటించారు. పదవీకాలం అయిపోగానే ఎంచక్కా తన కార్లను స్వయంగా నడుపుకుంటూ షికార్లు చేశారు.

More Telugu News