Tejashwi Yadav: బీహార్ లో కీలకనేతగా ఎదిగిన తేజస్వి యాదవ్ ఐపీఎల్ లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించాడని తెలుసా..?

  • బీహార్ ఎన్నికల్లో మార్మోగిన తేజస్వి పేరు
  • ఆర్జేడీకి ఒంటిచేత్తో 75 స్థానాలు గెలిపించిన తేజస్వి
  • 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్ లో ఢిల్లీకి ప్రాతినిధ్యం
  • రిజర్వ్ బెంచ్ కే పరిమితం
Tejaswi Yadav cricket career

బీహార్ ఎన్నికల వేళ ఎక్కువగా వినిపించిన పేరు తేజస్వి యాదవ్. ఆర్జేడీ పార్టీకి ఒంటి చేత్తో 75 అసెంబ్లీ స్థానాలు గెలిపించడంతో తేజస్వి పాప్యులారిటీ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. పార్టీ సుప్రీమ్ లాలూ ప్రసాద్ యాదవ్ లేకపోయినా తేజస్వి ఒంటరిపోరు రాజకీయ మహామహులను సైతం ఆకట్టుకుంది. అయితే తేజస్వియాదవ్ రాజకీయాల్లో ఇంతగా మమేకం అవుతున్నా, గతంలో ఆయన లక్ష్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఆయన భారత క్రికెట్ జట్టుకు ఆడాలని కలలు కన్నారు. ఈ క్రమంలో ఝార్ఖండ్ రాష్ట్ర జట్టు తరఫున పలు దేశవాళీ మ్యాచ్ లు కూడా ఆడారు. లాలూ, రబ్రీ బీహార్ ను పాలించిన సమయంలో తేజస్వి మనసంతా క్రికెట్ పైనే ఉండేది. క్రికెట్ పై అనురక్తితో 9వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పిన ఈ కుర్రాడు ఎక్కువగా ప్రాక్టీసు చేస్తూ కనిపించేవాడు.

ఝార్ఖండ్ జట్టుకు ఆడుతూ కొన్ని మ్యాచ్ లలో ధాటిగా ఆడినా, మరికొన్నింట్లో విఫలమయ్యాడు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... తేజస్వి ఐపీఎల్ లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. అప్పట్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు 2008 నుంచి 2012 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో హేమాహేమీలు ఉండడంతో తేజస్వి రిజర్వ్ బెంచ్ కే పరిమితం అయ్యాడు.

ఒక్క మ్యాచ్ లోనూ బరిలో దిగే చాన్సు రాకపోవడంతో, తన కుమారుడి పరిస్థితిపై లాలూ తనదైన శైలిలో చమత్కరించారు. మావాడు ప్రస్తుతం నీళ్లు, కండువాలు అందిస్తున్నాడు, ఇక బ్యాటింగ్ చేయడమే తరువాయి అని వ్యాఖ్యానించారు. కాగా, క్రికెట్ లో అవకాశాలు సన్నగిల్లడంతో తేజస్వి రాజకీయాల్లో ప్రవేశించి ప్రస్తుతం ఫుల్ టైమ్ పొలిటిషీయన్ గా కార్యకలాపాలు సాగిస్తున్నారు.

More Telugu News