రష్యా సైనిక హెలికాప్టర్ కూల్చివేత... పొరపాటైందని క్షమాపణలు కోరిన అజర్ బైజాన్!

10-11-2020 Tue 08:43
  • అర్మేనియా సరిహద్దుల్లో ఘటన
  • ఇద్దరు దుర్మరణం, మరొకరికి గాయాలు
  • నష్టపరిహారం చెల్లిస్తామన్న అజర్ బైజాన్
Russia Helecopter Drowned by Azarbizan and says Sorry
రష్యాకు చెందిన ఓ సైనిక హెలికాప్టర్ ను అర్మేనియా సరిహద్దుల్లో పొరపాటున కూల్చివేశామని, ఇందుకు క్షమాపణలు కోరుతున్నామని అజర్ బైజాన్ పేర్కొంది. కాగా, ఈ హెలికాప్టర్ లో ఉన్న ముగ్గురిలో ఇద్దరు మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

తమ చాపర్ ను అజర్ బైజాన్ దళాలు కూల్చి వేశాయని పేర్కొన్న రష్యా అధికారులు, ఇది ఓ విషాదకరమైన ఘటనని, వారు క్షమాపణలు చెప్పారని ఓ ప్రకటన విడుదల చేసింది. వారు లక్ష్యంగా చేసుకున్నది తమ హెలికాప్టర్ ను కాదని, కానీ అక్కడ పొరపాటు జరిగిపోయిందని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది.

కాగా, చీకటి పడుతూ ఉండటంతో ఈ చాపర్ తక్కువ ఎత్తులో అర్మేనియా, అజర్ బైజాన్ సరిహద్దుల ప్రాంతంలో ఎగురుతున్న వేళ ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్ ను చూసి వేర్పాటువాదులు దాడి చేస్తున్నారని భావించిన సైనికులు, దాన్ని పేల్చి వేశారు. ఈ ప్రాంతంలో అర్మేనియా వేర్పాటువాదుల ప్రాబల్యం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇక మరణించిన కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి నష్ట పరిహారాన్ని చెల్లిస్తామని అజర్ బైజాన్ ప్రకటించింది.