Old Man: అంబులెన్స్ కు దారిచూపిన ట్రాఫిక్ పోలీసు స్ఫూర్తి వృథా పోలేదు... వృద్ధుడు క్షేమం!

  • సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో
  • అంబులెన్స్ కు ట్రాఫిక్ క్లియర్ చేసిన కానిస్టేబుల్ బాబ్జీ
  • రెండు కిలోమీటర్లు పరిగెత్తిన వైనం
  • కోలుకున్న వృద్ధుడు
Old man who was in the ambulance got cured as traffic police Babji gesture won the hearts

ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ రోడ్డుపై పరుగులు తీస్తుండగా, అతడిని ఓ అంబులెన్స్ అనుసరించి వెళ్లడం కనిపించింది. ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరు బాబ్జీ. హైదరాబాద్ అబిడ్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే బాబ్జీ ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకోవడం గమనించి తానే స్వయంగా ఆ అంబులెన్స్ ముందు పరిగెడుతూ ట్రాఫిక్ క్లియర్ చేశాడు. ఆ విధంగా రెండు కిలోమీటర్ల దూరం పరుగెత్తి అంబులెన్స్ సజావుగా వెళ్లేందుకు శ్రమించాడు. ఇప్పుడతని స్ఫూర్తి వృథా పోలేదు.

ఆ రోజున ఆ అంబులెన్స్ లో ఉన్న వృద్ధుడు ఆరోగ్యం పొంది ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆ వృద్ధుడు హయత్ నగర్ కు చెందిన వ్యక్తి. గుండె, కిడ్నీల సమస్యతో బాధపడుతుండడంతో మలక్ పేట యశోద ఆసుపత్రికి తరలించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీ కారణంగానే ఆ వృద్ధుడు సకాలంలో ఆసుపత్రికి చేరగలిగాడు. ఇవాళ డిశ్చార్జి అవుతూ ఆ వృద్ధుడు, ఆయన కుటుంబసభ్యులు కానిస్టేబుల్ బాబ్జీకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. కాగా, అంబులెన్స్ లోని వృద్ధుడు కోలుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

More Telugu News