Stalin: తమిళజాతి గర్వపడేలా చేశారంటూ కమలా హారిస్ కు లేఖ రాసిన స్టాలిన్

DMK Chief Stalin lauds newly elected US Vice President Kamala Harris
  • అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ విజయం
  • తమిళ మూలాలను ప్రస్తావించిన స్టాలిన్
  • వణక్కం అంటూ ప్రారంభించి తమిళంలో లేఖ
అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతి మహిళ కమలా హారిస్ మూలాలు తమిళనాడులో ఉన్న సంగతి తెలిసిందే. తమిళ మహిళ అగ్రరాజ్య ఉపాధ్యక్ష పదవి చేపట్టనుండడంతో తమిళనాట సంబరాలు మామూలుగా లేవు. కమలా హారిస్ పూర్వీకుల గ్రామం తులసేంద్రపురంలో అయితే ఆనందం అంబరాన్నంటుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ అమెరికా నూతన ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ కు లేఖ రాశారు.

"వణక్కం" అంటూ మొదలుపెట్టి లేఖను తమిళంలో రాశారు. "మీ విజయంతో తమిళ జాతి గర్వపడేలా చేశారు" అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ద్రవిడ సంస్కృతి గొప్పదనాన్ని ప్రపంచం నలుదిశలా చాటాలని, అమెరికా ప్రతిష్ఠ మరింతగా విస్తరింపజేయాలని స్టాలిన్ ఆకాంక్షించారు. ద్రవిడ ఉద్యమం లింగ వివక్షకు తావులేని సమాజాన్ని కాంక్షిస్తుందని, ఇప్పుడా ఉద్యమానికి కమలా హారిస్ విజయం దన్నుగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఓ తమిళ మహిళ అమెరికాను పాలించగల సత్తా కలిగి ఉందన్న విషయాన్ని మీ విజయంతో నిరూపించారని కమలా హారిస్ ను వేనోళ్ల కొనియాడారు.
Stalin
Kamala Harris
Tamilnadu
Vice President
USA

More Telugu News