Bihar: ఓట్ల లెక్కింపు సమీపిస్తున్న వేళ... తన కార్యకర్తలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తేజస్వీ యాదవ్!

Tejaswi Yadav Serious Warning to RJD Cadre
  • రేపు బీహార్ ఎన్నికల కౌంటింగ్
  • కార్యకర్తలు క్రమశిక్షణ పాటించాలి
  • ప్రత్యర్థి నేతలను టార్గెట్ చేసుకోవద్దు
  • ఫలితాలు ఎలాగున్నా సంయమనం పాటించాలి
  • ట్విట్టర్ లో హెచ్చరించిన తేజస్వి యాదవ్
బీహార్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు ప్రారంభం కానున్న నేపథ్యంలో, రాష్ట్రీయ జనతాదళ్ కార్యకర్తలు, కౌంటింగ్ రోజున క్రమశిక్షణ పాటించాలని, ఎక్కడా, ఎటువంటి సంబరాలు చేసుకోవద్దని, బాణసంచా కాల్చవద్దని, ప్రత్యర్థి పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకోవద్దని తేజస్వీ యాదవ్ హెచ్చరించారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన, "నవంబర్ 10న ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. ఫలితాలు ఎలాగున్నా, మనం సంయమనంతో ఉండాలి. శాంతిని కోరుకోవాలి. ఏ కార్యకర్తా కూడా రంగులు, బాణసంచా వాడవద్దు. విజయం సాధించామన్న ఆనందంలో క్రమశిక్షణ తప్పరాదు" అని వ్యాఖ్యానించారు.

ఆపై మరో ట్వీట్ లో "ఆర్జేడీకి చెందిన ప్రతి కార్యకర్తా, ఫలితాలను గౌరవించాలి. ప్రజలకు అసౌకర్యం కలిగే పనులు చేయరాదు" అని అన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, నితీశ్ కుమార్ కూటమికి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన నేపథ్యంలో, తేజస్వి ఈ కామెంట్ చేయడం గమనార్హం. తేజస్వీ యాదవ్ తల్లిదండ్రులు, బీహార్ ను 15 సంవత్సరాల పాటు పాలించిన లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీల చుట్టూ అవినీతి ఆరోపణలు, కేసులు చుట్టుముట్టగా, దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపితుడైన లాలూ, ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో ఎన్డీయే తన ప్రచారంలో సైతం ఈ కుంభకోణాలను ప్రస్తావించడం జరిగింది. మరోసారి ఆర్జేడీ విజయం సాధిస్తే, ఆటవిక రాజ్యం వస్తుందని నితీశ్ తో పాటు, పలుమార్లు ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సైతం విమర్శలు గుప్పించినా, బీహార్ ప్రజలు మాత్రం మార్పును కోరుకుంటున్నారని, పోటీ గట్టిగా ఉన్నప్పటికీ, విజయం ఆర్జేడీ కూటమిదేనని సర్వే సంస్థలు తేల్చాయి. ప్రస్తుతం 31 ఏళ్ల వయసులో ఉన్న ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ను ప్రధాని మోదీ 'జంగ్లీ రాజ్ కా యువరాజ్' అంటూ పలుమార్లు సంబోధించిన సంగతి తెలిసిందే.

ఇక తుది దశ పోలింగ్ తరువాత విడుదలైన సర్వే సంస్థల లెక్కల ప్రకారం, తేజస్వి నేతృత్వంలోని కూటమికి సరాసరిన 128 సీట్లు, ఎన్డీయేకు 99, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి ఆరుస్థానాలు వస్తాయన్న అంచనాలు వెలువడ్డాయి. మొత్తం 243 అసెంబ్లీ సీట్లున్న అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 122. ఈ మార్క్ ను ఎవరు తాకుతారన్నది మంగళవారం మధ్యాహ్నానికి తేలిపోనుంది.
Bihar
Tejashwi Yadav
Counting
Warning

More Telugu News