Imran Khan: ఓ గుంటనక్కలా లండన్ లో కూర్చుని ఆర్మీని లక్ష్యంగా చేసుకున్నావు: నవాజ్ షరీఫ్ పై నిప్పులు చెరిగిన పాక్ ప్రధాని

Pakistan prime minister Imran Khan slams former PM Nawaj Sharif
  • ఇటీవలే పాక్ సైన్యంపై నవాజ్ షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు
  • షరీఫ్ వ్యాఖ్యలను ఖండించిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్
  • డబ్బు పిచ్చోడు అంటూ వ్యాఖ్యలు
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అత్యవసర చికిత్స కోసమంటూ న్యాయస్థానం అనుమతితో లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే నవాజ్ షరీఫ్ ఎంతో ఉల్లాసంగా లండన్ రోడ్లపై విహరిస్తూ, అక్కడి రెస్టారెంట్లలో ఆస్వాదిస్తున్న దృశ్యాలు తదనంతర కాలంలో దర్శనమిచ్చాయి. అవినీతి ఆరోపణలతో ప్రధాని పదవిని కోల్పోయిన ఆయన ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు.

ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. ఆర్మీ చీఫ్ ఖమర్ బజ్వా, ఐఎస్ఐ అధిపతి ఫయాజ్ హమీద్ 2018 ఎన్నికల్లో జోక్యం చేసుకుని ఇమ్రాన్ ఖాన్ కు అనుకూల ఫలితం వచ్చేలా చేశారని నవాజ్ షరీఫ్ ఆరోపించారు.

దీనిపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఘాటుగా స్పందించారు. ఓ గుంటనక్కలా లండన్ లో కూర్చుని పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ నవాజ్ షరీఫ్ పై మండిపడ్డారు. నవాజ్ షరీఫ్ పాక్ సైన్యంలో తిరుగుబాటు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని ఇమ్రాన్ ఆరోపించారు.

పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటోందని వ్యాఖ్యానిస్తున్నాడని, ఆర్మీ, ఐఎస్ఐ చీఫ్ లను మార్చాలని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా సైన్యంలో చీలిక తేవాలన్నది షరీఫ్ ఎత్తుగడ అని ఇమ్రాన్ పేర్కొన్నారు. షరీఫ్ ఓ డబ్బు పిచ్చోడని, దేశాన్ని దోచుకోవడం ద్వారా పెద్ద ఎత్తున సంపద పోగేసుకున్నాడని ఆరోపించారు.

నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ కూడా ఇదే తరహాలో మాట్లాడుతున్నారని, రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటోందని ఆమె బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. తాను ఓ మహిళ కావడంతో ఆ ఆధిక్యతను ఆమె ఈ విధంగా మాట్లాడేందుకు ఉపయోగించుకుంటున్నారని, పాక్ లో మహిళలకు గౌరవం ఇస్తారని ఇమ్రాన్ పేర్కొన్నారు.

"నవాజ్ షరీఫ్ కానీ, అతని కుమారులు కానీ పాక్ లో ఉన్నప్పుడు సైన్యాన్ని ఏమీ అనలేకపోయారు. అందుకే వారు పారిపోయారు. ఇక తాను మహిళ కాబట్టి తనను ఎవరూ జైల్లో వేయలేరని భావించి మరియం నవాజ్ సైన్యంపై విషం కక్కడం ప్రారంభించారు" అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.
Imran Khan
Nawaj Sharif
Pakistan
Army
London

More Telugu News