Sourav Ganguly: ఆస్ట్రేలియా టూర్ లో భారత్ విజయావకాశాలు కోహ్లీ కెప్టెన్సీ సత్తాపైనే ఆధారపడి ఉన్నాయి: గంగూలీ

Sourav Ganguly opines on India tour of Australia
  • త్వరలో ఆస్ట్రేలియా వెళుతున్న  టీమిండియా
  • జనవరి 19 వరకు పర్యటన
  • భారత పేస్ దళం బలంగా ఉందన్న గంగూలీ
భారత క్రికెట్ జట్టు మరికొన్నిరోజుల్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతోంది. జనవరి 19 వరకు కొనసాగే కఠినమైన ఆసీస్ టూర్ లో టీమిండియా విజయావకాశాలు ప్రధానంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నాయకత్వ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటాయని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. అందుబాటులో ఉన్న వనరులను కోహ్లీ ఎంత సమర్థంగా వాడుకుంటాడన్నదే కీలకమని పేర్కొన్నారు.

"భారత పేస్ దళం ఈసారి అత్యంత నాణ్యంగా కనిపిస్తోంది. నవదీప్ సైనీ గతేడాది కంటే ఈసారి ఊహించనంతగా మెరుగయ్యాడు. మంచి పేస్, మంచి లెంగ్త్ తో బౌలింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. టీమిండియా పేస్ విభాగం ఎంతో బలంగా ఉంది. ఈ విషయం నేను బీసీసీఐ అధ్యక్షుడిగా చెప్పడంలేదు, ఓ ఆటగాడిగా చెబుతున్నా. తన బౌలర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టుకోవడం కోహ్లీకి సంబంధించిన విషయం. ఎక్కడ ఎదురుదాడి చెయ్యాలో, ఎక్కడ తగ్గాలో ఓ సారథిగా కోహ్లీనే నిర్ణయించుకోవాలి.

మ్యాచ్ లో ఏ దశలో అశ్విన్ కు బంతి ఇవ్వాలో, లేక బుమ్రాతో బౌలింగ్ చేయించాలో, లేక సైనీ, లేక ఇషాంత్ శర్మ, లేక రవీంద్ర జడేజాతో బౌలింగ్ దాడి చేయించాలన్నది కోహ్లీ కెప్టెన్సీ నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది" అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆస్ట్రేలియాలో ఓపెనింగ్ భాగస్వామ్యం ఎంతో కీలకమని గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలోనే కాదు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ లో మొదటి 20 ఓవర్లు చాలా ముఖ్యమని అన్నారు.
Sourav Ganguly
Virat Kohli
Australia
Team India

More Telugu News