నితీశ్ కుమార్ గొప్ప నాయకుడు.. ఆయనకు గౌరవంగా వీడ్కోలు పలకాలి: సంజయ్ రౌత్ వ్యంగ్యం

07-11-2020 Sat 16:16
  • ఇవే తనకు చివరి ఎన్నికలు అన్న నితీశ్ కుమార్
  • నితీశ్ తన ఇన్నింగ్స్ ఆడేశారన్న సంజయ్ రౌత్
  • ఆయనకు వీడ్కోలు పలికేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
Bihar people are ready to give farewell to Nitish Kumar

ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, నితీశ్ కుమార్ గొప్ప నాయకుడని... ఆయన తన ఇన్నింగ్స్ ఆడేశారని చెప్పారు. ఒక నాయకుడు ఇవే తనకు చివరి ఎన్నికలని చెప్పినప్పుడు ఆయనకు కచ్చితంగా వీడ్కోలు పలకాల్సిందేనని వ్యంగ్యంగా అన్నారు. నితీశ్ కు మంచి ఫేర్ వెల్ ఇచ్చేందుకు బీహార్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

అయితే నితీశ్ వ్యాఖ్యలపై జేడీయూ నేతలు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు నితీశ్ దూరం కావడం లేదని చెప్పారు. నితీశ్ వ్యాఖ్యలు ఎన్నికల ప్రచారానికి సంబంధించినవి మాత్రమేనని తెలిపారు. మరోవైపు ఈరోజు బీహార్ లో చివరి విడత పోలింగ్ జరుగుతోంది. 10 తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.