Actress kushboo: కర్ణాటక నుంచి రాజ్యసభకు నటి ఖుష్బూ.. బీజేపీ యోచన

BJP want to send actress kushboo to rajyasabha from karnataka
  • రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ మరణంతో సీటు ఖాళీ
  • పరిశీలనలో రజనీకాంత్, ఐపీఎస్ అధికారి అన్నామలై, ఖుష్బూల పేర్లు
  • అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడవచ్చని బీజేపీ యోచన
కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఇటీవల బీజేపీలో చేరిన తమిళనటి ఖుష్బూ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ అధిష్ఠానం ఆమె పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ ఇటీవల కరోనాతో కన్నుమూశారు.

 ఈ స్థానానికి డిసెంబరు ఒకటో తేదీన ఎన్నిక జరగనుండగా, ఆ సీటు కోసం ఖుష్బూ పేరును బీజేపీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికవడం ఇక్కడ సర్వసాధారణ విషయమే. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి ఒకరిని ఎంపిక చేస్తే ఆ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చన్నది బీజేపీ యోచనగా కనిపిస్తోంది.

ఇందులో భాగంగా ముగ్గురి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కర్ణాటకలో పోలీసు ఉన్నతాధికారిగా సేవలు అందించి, రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఐపీఎస్ అధికారి అన్నామలై, ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటి ఖుష్బూ పేర్లను పరిశీలనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

అయితే, బీజేపీ ప్రతిపాదనను రజనీకాంత్ అంగీకరించే అవకాశం లేదని సమాచారం. ఇక, మిగిలిన ఇద్దరిలో ఖుష్బూను ఎంపిక చేస్తే రాష్ట్రంలో బీజేపీ ఇమేజ్ పెరుగుతుందని ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా భావిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఖుష్బూ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.
Actress kushboo
BJP
Rajya Sabha
Karnataka

More Telugu News