Virat Kohli: కోహ్లీ ఉంటే బెంగళూరుకు కప్పు కలే.. విరుచుకుపడుతున్న అభిమానులు

Fans fires on Bengaluru captain virat kohli
  • ఎలిమినేటర్ మ్యాచ్‌లో దారుణంగా ఆడిన బెంగళూరు
  • భారత జట్టుకు కోహ్లీ పెద్దగా సాధించినదేమీ లేదన్న అభిమానులు
  • తమ ప్రయాణం అద్భుతంగా సాగిందన్న కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో కప్పు కొట్టాలన్న కల ఆ జట్టుకు మరోమారు కలగానే మిగిలింది. టోర్నీ ఆరంభంలో అద్భుతంగా ఆడిన బెంగళూరు జట్టు ఆ తర్వాత వరుస ఓటములతో చచ్చీచెడీ చివరికి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోహ్లీసేన నిన్నటి మ్యాచ్‌లో చెత్తగా ఆడి అభిమానుల ఆగ్రహానికి గురైంది.

ఓటమి అనంతరం ఆ జట్టుపై బెంగళూరు అభిమానులు విరుచుకుపడ్డారు. బెంగళూరు జట్టుకు కోహ్లీ కెప్టెన్‌గా ఉండగా కప్పు సాధించడం అసాధ్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టుకు కూడా కోహ్లీ పెద్దగా సాధించినదేమీ లేదని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కాగా, నిన్నటి మ్యాచ్ అనంతరం కోహ్లీ తన జట్టుతో కలిసి తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఒడిదొడుకుల సమయంలోనూ జట్టు సమష్టిగా ఉందని, ఒక బృందంగా ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉందని అన్నాడు. పరిస్థితులు తమకు అనుకూలంగా లేవన్నది నిజమే అయినా తమ ఆటగాళ్ల ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని అన్నాడు. తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన కోహ్లీ.. త్వరలోనే మళ్లీ అభిమానుల ముందుకు వస్తామని పేర్కొన్నాడు.
Virat Kohli
Bengaluru
IPL 2020

More Telugu News