Teegala Krishna Reddy: బీజేపీలో చేరనున్న టీఆర్ఎస్ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి?

  • సబిత టీఆర్ఎస్ లో చేరడంతో తీగలకు మొదలైన కష్టాలు
  • ఎమ్మెల్సీ పదవిపై కూడా రాని క్లారిటీ
  • తీగలతో చర్చలు జరిపిన బీజేపీ నేతలు
Teegala Krishna Reddy to join BJP

మరికొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో టీఆర్ఎస్ కు ఆ పార్టీ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి షాక్ ఇవ్వబోతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కారు దిగి కమలం గూటికి చేరేందుకు ఆయన సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల తర్వాత నుంచి కూడా ఆయన టీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.

2014లో హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా తీగల గెలుపొందారు. ఆ తర్వాత కొన్ని రోజులకే టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. అయితే, తీగలపై గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరి, మంత్రి కూడా అయ్యారు. అప్పటి నుంచి తీగలకు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.

ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ నాయకత్వం చెప్పిన తర్వాత ఆయన కొంచెం శాంతించారు. అయితే, ఆ దిశగా ఇంత వరకు ఎలాంటి సంకేతాలు లేకపోవడంలో ఆయన తీవ్ర అసంతృప్తికి  గురయ్యారు. ఇదే సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ... టీఆర్ఎస్ అసంతృప్త నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే తీగలతో బీజేపీ కీలక నేతలు చర్చలు జరిపినట్టు సమాచారం. మరోవైపు తీగలను మంత్రి మల్లారెడ్డి బుజ్జగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై కొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ రానుంది.

More Telugu News