Reliance: మా డేటా వివరాలు ఎవరికీ వెల్లడించం: పార్లమెంట్ కు స్పష్టం చేసిన రిలయన్స్

  • గూగుల్, ఫేస్ బుక్ సహా ఇన్వెస్టర్లెవరికీ చెప్పబోము
  • అటువంటి మెకానిజం జియో వద్ద లేదు
  • మీనాక్షి లేఖి కమిటీకి స్పష్టం చేసిన జియో
Jio Clarifies Wont Share Data of Customers

తమ సర్వర్లలో ఉన్న డేటాను గూగుల్, ఫేస్ బుక్ సహా ఇతర ఇన్వెస్టర్లతో పంచుకునే మెకానిజం తమ వద్ద లేదని, ఈ వివరాలను ఎవరికీ అందించబోమని జియో ప్లాట్ ఫామ్స్, జియో ఇన్ఫోకామ్ స్పష్టం చేసింది. ఈ మేరకు విషయాన్ని పార్లమెంటరీ కమిటీకి సంస్థ ప్రతినిధులు స్పష్టం చేశారు.

 డేటా భద్రతపై తాము అత్యున్నత ప్రమాణాలను పాటిస్తున్నామని వారు తెలిపారు. సంస్థలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లతో కస్టమర్లకు చెందిన ఏదైనా సమాచారాన్ని పంచుకుంటున్నారా? అని పార్లమెంటరీ కమిటీ అడిగిన ప్రశ్నకు రిలయన్స్ సమాధానం ఇచ్చింది. ఈ కమిటీకి బీజేపీకి చెందిన మీనాక్షీ లేఖి నేతృత్వం వహిస్తున్నారు.

"డేటా షేరింగ్ పై మేము జియో అధికారులను ప్రశ్నించాము. యూజర్లకు సంబంధించిన ఎటువంటి సమాచారాన్నీ పంచుకోవడం లేదని వారి నుంచి సమాధానం వచ్చింది" అని మీనాక్షి తెలిపారు. థర్డ్ పార్టీకి కూడా సమాచారాన్ని ఇవ్వడం లేదని జియో అధికారులు స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. ఈ మేరకు రిలయన్స్ నుంచి తమకు హామీ కూడా లభించిందన్నారు.

ఇక భారత వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని ఇక్కడి సర్వర్లలోనే భద్రపరుస్తున్నామని కూడా రిలయన్స్ పార్లమెంట్ కు స్పష్టం చేసింది. భారత సార్వభౌమాధికారం, వినియోగదారుల భద్రత నిమిత్తమే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఇక దేశంలో డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వసతులను పెంచేందుకు కూడా తాము కట్టుబడివున్నామని అధికారులు పేర్కొన్నట్టు కమిటీ వెల్లడించింది.

More Telugu News