ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ వ్యవహారం.. కోహ్లీ, రానా, తమన్నా, గంగూలీలకు కోర్టు నోటీసులు!
- ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ కు ప్రచారకర్తలుగా సినీ, క్రీడా ప్రముఖులు
- ఈ డబ్బంతా ఎక్కడకు పోతోందని ప్రశ్నించిన మధురై బెంచ్
- ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ ను తెలంగాణలో రద్దు చేసిన అంశాన్ని గుర్తు చేసిన కోర్టు
ఆన్ లైన్ రమ్మీకి ఎంతో మంది బానిసలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఎంతో మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దీన్ని నిషేధించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీన్ని విచారించిన కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను సంధించింది.
ఆన్ లైన్ జూదానికి సంబంధించిన డబ్బు ఎక్కడకు పోతుందని ప్రశ్నించింది. తెలంగాణలో ఆన్ లైన్ జూదాన్ని నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన మధురై బెంచ్... తమిళనాడులో అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? అని అడిగింది. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ నిషేధంపై పది రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. తదుపరి విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.