Central Mali: మాలీపై విరుచుకుపడ్డ ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్... 50 మంది అల్ ఖైదా ఉగ్రవాదుల హతం!

France Air Strikes Killed 50 Al Khaida Terrorists in Central Mali
  • బాంబుల వర్షం కురిపించిన యుద్ధ విమానాలు
  • సైన్యానికి చిక్కిన నలుగురు ఉగ్రవాదులు
  • గ్రేటర్ సహారాలో కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్స్
సెంట్రల్ మాలీపై ఫ్రాన్స్ కు చెందిన యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించగా, దాదాపు 50 మంది అల్ ఖైదాకు చెందిన జీహాదీలు హతమయ్యారు. ఈ విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం స్వయంగా వెల్లడించింది.

 బుర్కినా ఫాసో, నైగర్ సరిహద్దుల్లో వేచివున్న ప్రభుత్వ దళాలు ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకునేందుకు వీలును కల్పించేందుకు ఈ దాడులు చేసినట్టు ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లీ వెల్లడించారు. మాలీలో బర్కానే దళాలతో కలిసి ఈ దాడులు చేశామని, ఉగ్రవాదులకు చెందిన ఆయుధాలను, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు.

ఈ దాడుల్లో ఉగ్రవాదులకు చెందిన 30 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయని ఆమె వెల్లడించారు. కాగా, నైగర్ అధ్యక్షుడు మహమదౌ ఇసోఫౌవుతో పార్లీ సమావేశం జరిగిన గంటల వ్యవధి తరువాత ఈ దాడులు జరగడం గమనార్హం. మూడు దేశాల సరిహద్దుల్లో భారీ ఎత్తున మోటార్ సైకిల్ కారవాన్ సాగుతోందని తమ డ్రోన్లు గుర్తించిన తరువాత, విమానాలు వెళ్లి దాడులు చేశాయని ఆమె స్పష్టం చేశారు. దాడుల నుంచి తప్పించుకోవాలని ఉగ్రవాదులు చెట్లు తదితరాల చాటుకు వెళ్లారని, ఈ దాడుల్లో రెండు మిరేజ్ జెట్లు, ఓ డ్రోన్ ను పంపి, మిసైల్స్ ను జారవిడిచామని పార్లీ తెలియజేశారు.

ఇక ఈ దాడుల తరువాత నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టు సైనిక అధికారి కల్నర్ ఫ్రెడ్రిక్ బార్బరీ తెలియజేశారు. దాడులు జరిగిన ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు, ఆత్మాహుతి దాడికి వినియోగించే దుస్తులు తదితరాలను స్వాధీనం చేసుకున్నట్టు ఫ్రెడ్రిక్ తెలిపారు. ఇక, గ్రేటర్ సహారా ప్రాంతంలోనూ ఆర్మీ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని, ఈ ప్రాంతంలో ఉగ్రవాదులను తుదముట్టించేందుకు 3 వేల మందికి పైగా సైన్యం శ్రమిస్తోందని తెలిపారు.
Central Mali
France
Airforce
Attack
Jihadists

More Telugu News