Malabar Excersise: మొదలైన నాలుగు దేశాల మలబార్ నౌకా విన్యాసాలు!

  • ఇండియాతో పాటు భాగమైన యూఎస్, ఆస్ట్రేలియా, జపాన్
  • పలు అత్యాధునిక యుద్ధ విమానాలతో విన్యాసాలు
  • ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
  • ఇండియా తరఫున పాల్గొంటున్న పలు వార్ షిప్, సబ్ మెరైన్ లు
MalabarNavy Excersise Started

బంగాళాఖాతంలో నాలుగు దేశాల మలబార్-20 నౌకాదళ సముద్ర విన్యాసాలు నేడు మొదలయ్యాయి. ఇండియా నిర్వహిస్తున్న ఈ విన్యాసాల్లో అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియాలు కూడా పాల్గొంటున్నాయి. ఈ విన్యాసాల్లో ఆస్ట్రేలియా పాల్గొనడంపై చైనా ఆగ్రహంగా ఉన్నా, ఆ దేశం మాత్రం వెనుకడుగు వేయకుండా పాల్గొంటుండటం గమనార్హం.

ఇక ఈ విన్యాసాలు 1992లో మొదలుకాగా, తొలి దశలో ఇండియా, యూఎస్ ల శిక్షణా కార్యక్రమంగానే సాగింది. 2015లో మలబార్ విన్యాసాల్లో శాశ్వత సభ్య దేశంగా జపాన్ వచ్చి చేరగా, తాత్కాలిక భాగస్వాములుగా ఆసీస్, సింగపూర్ లు వచ్చాయి. 2007లో ఆస్ట్రేలియా ఈ వేడుకల్లో పాల్గొన్న తరువాత, చైనా నుంచి వచ్చిన ఒత్తిడితో ఆ దేశం వెనక్కు తగ్గింది.

ఓ చతుర్భుజ కూటమిగా ఏర్పడే నాలుగు దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. చైనా సముద్రంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం, తత్ఫలితంగా ఏర్పడుతున్న అనిశ్చితికి చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సంవత్సరం విన్యాసాలు సాగుతున్నాయి. గత సంవత్సరం ఈ విన్యాసాలకు రెండు యుద్ధ నౌకలను పంపిన భారత్, ఈ దఫా మరిన్ని విమాన వాహక, యుద్ధనౌకలను పంపింది. అమెరికా నుంచి ఇప్పటికే నిమిజ్, రోనాల్డ్ రీగన్, జాన్ ఎస్ మెక్ కెయిన్ (గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్) తదితర వార్ షిప్ లు చేరుకున్నాయి.

జపాన్ నుంచి హెలికాప్టర్ వాహక నౌక ఇజుమో, ఒనామీ (డిస్ట్రాయర్) రాగా, ఆస్ట్రేలియా తన ప్రతిష్ఠాత్మక హర్ మెజిస్టీస్ ఆస్ట్రేలియన్ షిప్ (లాంగ్ రేంజ్ ఫ్రిగేట్స్), ఇంటిగ్రల్ ఎంహెచ్ 60 హెలికాప్టర్ యుద్ధనౌకను పంపనుంది. ఈ నెలలో రెండు దశలుగా విన్యాసాలు సాగనున్నాయి. ఇండియన్ నేవీతో పాటు యునైటెడ్ స్టేట్స్ నేవీ, జపాన్ మెరీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్, రాయల్ ఆస్ట్రేలియన్ నేవీల ఆధ్వర్యంలో ఈ విన్యాసాలు 6వ తేదీ వరకూ జరుగనున్నాయి.

ఇక తొలి దశలో భాగంగా భారత నౌకాదళం రియర్ అడ్మిరల్ సంజయ్ వాత్సవన్ నేతృత్వంలో ఈ విన్యాసాల్లో పాల్గొననుంది. ఈ విన్యాసాల్లో డిస్ట్రాయర్ రణ్ విజయ్, ఫ్రిగేట్ శివాలిక్, ఆఫ్ షోర్ పెట్రోల్ వెసెల్ సుకన్య, ఫ్లీట్ సపోర్ట్ షిప్ శక్తి, సబ్ మెరైన్ సింధురాజ్ తదితరాలు కూడా భాగం కానున్నాయి. వీటికి తోడుగా అడ్వాన్డ్స్డ్ జెట్ ట్రయినర్ హక్, లాంగ్ రేంజ్ మేరీటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ పీ-81 తదితరాలు కూడా పాల్గొననున్నాయి.

More Telugu News