పోలవరం బకాయిల విడుదలకు నిర్ణయం... నిర్మలకు ధన్యవాదాలు తెలిపిన సోము వీర్రాజు

02-11-2020 Mon 21:56
  • పోలవరం బకాయిలపై కేంద్రం సానుకూల స్పందన
  • రూ.2,234 కోట్ల విడుదలకు అభ్యంతరాల్లేవన్న ఆర్థికశాఖ
  • జలశక్తి శాఖకు మెమో
AP BJP Chief Somu Veerraju thanked Nirmala Sitharaman

ఆంధ్రుల జీవనాడిగా పేరుపొందిన పోలవరం ప్రాజెక్టు బకాయిలను విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. పోలవరం బకాయిలను బేషరతుగా విడుదల చేయాలన్న కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయంపై కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. నిధుల విడుదల కోసం కేంద్ర జలశక్తి శాఖకు సూచించడం ఆంధ్రప్రదేశ్ రైతుల పట్ల ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం అని కొనియాడారు.

పోలవరం ప్రాజెక్టుపై గత కొన్నిరోజులుగా నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ బకాయిల విడుదలకు కేంద్ర ఆర్ధిక శాఖ సానుకూల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రూ.2,234 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఏ విధమైన అభ్యంతరాలు లేవని కేంద్ర ఆర్థికశాఖ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి పీపీఏ ప్రక్రియ పూర్తిచేయాలంటూ జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ మెమో పంపింది.