Chandrababu: నా ప్లానింగ్ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి: ముంబయి ఐఐటీ విద్యార్థులతో చంద్రబాబు

Chandrababu talks with IIT Bombay students
  • ముందుచూపుతో విజన్ 2020 రూపొందించినట్టు వెల్లడి
  • కొత్త రాష్ట్రంలో రెండంకెల వృద్ధి సాధించామన్న చంద్రబాబు
  • ప్రతి ఒక్కరి జీవితానికి విజన్ ముఖ్యమని సూచన
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఐఐటీ బాంబే విద్యార్థులతో వీడియో లింక్ ద్వారా మాట్లాడారు. ప్రస్తుత కరోనా సంక్షోభం, గతంలో తన పాలన వంటి అంశాలపై ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి జీవితానికి విజన్ చాలా ముఖ్యమని అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలతో పాలన ప్రారంభించామని తెలిపారు.

సులభతర వాణిజ్యాన్ని సద్వినియోగం చేసుకున్నామని, వ్యవసాయ రంగాన్ని భారీగా ప్రోత్సహించడం ద్వారా 17 శాతం వృద్ధిరేటు సాధించామని చెప్పారు. కొత్త రాష్ట్రం సమస్యలతో కూడుకున్నది అయినా, రెండంకెల వృద్ధిరేటు అందుకున్నామని, జాతీయ వృద్ధి రేటు కంటే 3.5 శాతం ఎక్కువే సాధించామని ఉద్ఘాటించారు.

అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిన సమయంలో సైబరాబాద్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించానని వెల్లడించారు. ఐటీ కంపెనీలను తీసుకువచ్చేందుకు ప్రపంచమంతా తిరిగానని, ఆనాటి తన ప్లానింగ్ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం 4 శాతం జీడీపీ హైదరాబాద్ నుంచే వస్తోందని వివరించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎంతో ముందుచూపుతో విజన్ 2020 రూపొందించానని చంద్రబాబు తెలిపారు. ఇక సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సత్తా ఏంటో వెల్లడవుతుందని, ఇప్పుడు కరోనా సంక్షోభం కారణంగా వర్చువల్ ఆఫీసులు, డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ఆవిష్కరించారని వెల్లడించారు.
Chandrababu
Bombay IIT Students
Andhra Pradesh
Growth
Cyberabad
Hyderabad

More Telugu News