ఆర్ఆర్ఆర్ వివాదం: రాజమౌళికి బండి సంజయ్ వార్నింగ్

31-10-2020 Sat 22:24
  • వివాదాస్పదమవుతున్న రాజమౌళి సినిమా
  • ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీం పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్
  • టీజర్ లో ముస్లిం టోపీతో కనిపించిన ఎన్టీఆర్
  • బీజేపీ నేతల ఆగ్రహం
Bandi Sanjay warns Rajamouli

ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకుడన్న సంగతి తెలిసిందే. అయితే అనూహ్యరీతిలో ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కొమురం భీమ్ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ఇటీవల విడుదలైన టీజర్ లో ముస్లిం టోపీ పెట్టుకుని కనిపించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఎంపీ సోయం బాపురావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. చరిత్రను వక్రీకరిస్తే ఊరుకునేది లేదని అన్నారు. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ దర్శకుడు రాజమౌళిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొమురం భీమ్ కు టోపీ పెట్టడం ఏంటని మండిపడ్డారు. రాజమౌళికి దమ్ముంటే నిజాం రజకార్లకు బొట్టు పెట్టి సినిమా తీయాలని, లేకపోతే, పాతబస్తీ ముస్లింకు కాషాయ కండువా వేసి సినిమా తీయాలని సవాల్ విసిరారు. ఆర్ఆర్ఆర్ సినిమాను ఎలా రిలీజ్ చేస్తారో చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చారు.

అడుగడుగునా అడ్డుకోవడం ఖాయమని, సినిమా రీళ్లను తగులబెట్టడం తథ్యమని అన్నారు.  జాగ్రత్త... మీ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తారు, బరిగలతో కొట్టి చంపడం ఖాయం అంటూ బండి సంజయ్ హెచ్చరికలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.