ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

31-10-2020 Sat 20:52
  • నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం
  • పొట్టి శ్రీరాములకు పవన్ నివాళి
  • తాగ్యమూర్తులకు ప్రణామాలు అంటూ పవన్ ప్రకటన
Pawan Kalyan wishes on Andhra Pradesh day

నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. మనకంటూ ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడే మన ప్రజల జీవితాలు బాగుపడతాయని తలచి ఆంధ్రప్రదేశ్ అవతరణకు పాటుపడిన త్యాగమూర్తులకు ప్రణామాలు చేస్తున్నానని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం తృణప్రాయంగా ప్రాణాలు ధారపోసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు నీరాజనాలు అర్పిస్తున్నానని వెల్లడించారు. తెలుగుజాతి అభివృద్ధి, తెలుగు ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆవిష్కరించారని వివరించారు.

అయితే, ఏ లక్ష్యాలను ఆశించి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందో, ఆ లక్ష్యాలు సాధించి వాటి ఫలాలను ప్రజలకు అందించినప్పుడే నాటి త్యాగధనుల ఆశయం సిద్ధిస్తుందని పవన్ పేర్కొన్నారు. వారి ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, రాష్ట్రంలో తెలుగు భాష పరిఢవిల్లాలని, తెలుగుకు పట్టం కట్టాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.