ఇషాన్ కిషన్ విజృంభణ... ముంబయి ఖాతాలో మరో విక్టరీ

31-10-2020 Sat 18:39
  • దుబాయ్ లో ముంబయి వర్సెస్ ఢిల్లీ
  • 9 వికెట్ల తేడాతో ఢిల్లీ ఘోర పరాజయం
  • ఇషాన్ కిషన్ 72 నాటౌట్
Ishan Kishan blistering knock seals another win for Mumbai Indians

ఐపీఎల్ తాజా సీజన్ లో ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న ముంబయి ఇండియన్స్ మరో విజయం అందుకుంది. ఇవాళ దుబాయ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి జట్టు 9 వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 111 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి 14.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి గెలుపు తీరాలకు చేరింది.

ఓపెనర్ ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగులా చెలరేగడంతో ఢిల్లీ బౌలర్లు తేలిపోయారు. రబాడా, నోర్జే, అశ్విన్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. యువ కిషన్ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సులతో 72 పరుగులు సాధించాడు. చివర్లో సిక్స్ కొట్టి విజయం ఖరారు చేశాడు.

ఢిల్లీ బౌలర్లలో నోర్జే ఒక వికెట్ సాధించాడు. 26 పరుగులు చేసిన ముంబయి ఓపెనర్ డికాక్.. నోర్జే బౌలింగ్ లో అవుటయ్యాడు. కాగా, నేడు జరిగే రెండో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆడనుంది.