రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల

31-10-2020 Sat 17:11
  • తన తండ్రి కోలుకుంటున్నారని తెలిపిన రాజశేఖర్ కుమార్తె
  • శరీరం చికిత్సకు సహకరిస్తోందన్న వైద్యులు
  • వైద్య బృందం పర్యవేక్షిస్తోందని బులెటిన్ లో వెల్లడి
Actor Rajasekhar is recovering from Corona

కరోనా మహమ్మారి దెబ్బకు సినీ పరిశ్రమ వణుకుతోంది. సినిమా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతపడి... పరిశ్రమ కోట్లాది రూపాయలను నష్టపోయింది. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు కరోనా బారిన పడటం కూడా ఇండస్ట్రీని కలవరపాటుకు గురి చేసింది. తాజాగా హీరో రాజశేఖర్ కుటుంబం కూడా కరోనా బారిన పడింది. జీవితకు కరోనా తగ్గడంతో ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె హోం ఐసొలేషన్ లో ఉన్నారు.

రాజశేఖర్ మాత్రం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు రావడంతో అందరూ షాక్ కు గురయ్యారు. ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం బాగుందని ఆయన కుమార్తె శివాత్మిక తెలిపారు. డాడీ కోలుకుంటున్నారని ఆమె ట్వీట్ చేశారు. హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. దీంతో పాటు సిటీ న్యూరో ఆసుపత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ను షేర్ చేశారు.

'రాజశేఖర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన శరీరం చికిత్సకు సహకరిస్తోంది. వైద్యుల బృందం ఆయనను పర్యవేక్షిస్తోంది. హై ఫ్లో ఆక్సిజన్ ను ఆయనకు అందిస్తున్నాం' అని బులెటిన్ లో డాక్టర్లు పేర్కొన్నారు.