మోదీ పాత వీడియోను నితీశ్ కుమార్ పై అస్త్రంగా వాడిన తేజశ్వి యాదవ్

31-10-2020 Sat 14:33
  • ఐదేళ్ల క్రితం నితీశ్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు
  • 33 స్కాములు చేశారంటూ ప్రధాని ఆరోపణ
  • మీ గురించి మోదీ ఏం చెప్పారో వినండన్న తేజశ్వి
Tejashwi Yadav Shares PMs Old Clip To Attack Nitish Kumar

బీహార్ ఎన్నికల ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది. బీజేపీ, జేడీయూలు ఒక కూటమిగా బరిలోకి దిగగా... కాంగ్రెస్ తో కలిసి ఆర్జేడీ మహాకూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమి తరపున లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజశ్వి యాదవ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.

 ఓ వైపు నితీశ్ కుమార్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ నిప్పులు చెరుగుతూనే... 'తాము అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం' వంటి పలు ప్రజాకర్షక వాగ్దానాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, తేజశ్వి సభలకు జనాలు కూడా భారీ సంఖ్యలో వస్తుండటంతో ఎన్నికల పర్వం టెన్షన్ ను మరింత పెంచుతోంది.

నితీశ్ ప్రభుత్వాన్ని ఎండగట్టేందుకు తేజశ్వి అన్ని అస్త్రాలను వాడుతున్నారు. జేడీయూ ప్రభుత్వం రూ. 30 వేల కోట్ల కంటే ఎక్కువ ఉన్న దాదాపు 60 కుంభకోణాలు చేసిందని ఈ ఉదయం ఆరోపించారు. దీనికి సంబంధించి ఓ వీడియో సాక్ష్యాన్ని ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. నితీశ్ ప్రభుత్వం 30కి పైగా స్కాములు చేసిందని ప్రధాని మోదీ గతంలో విమర్శించిన వీడియోను ఈరోజు ఆయన జనాలకు చూపించారు.

గతంలో బీజేపీకి వ్యతిరేక పక్షంగా జేడీయూ ఉన్నప్పుడు మోదీ ఈ విమర్శలు గుప్పించారు. ఎప్పుడో మోదీ మాట్లాడిన వీడియోను ఈరోజు తేజశ్వి ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేశారు. 'గౌరవనీయులైన నితీశ్ గారూ... 60కి పైగా స్కాములను మీ ప్రభుత్వం చేసింది. వీటిలో 33 స్కాముల గురించి ఐదేళ్ల క్రితమే ప్రధాని మోదీ మాట్లాడారు. ఆనాడు మోదీ మాట్లాడిన మాటలను మీరు కూడా వినండి' అని తేజశ్వి ట్వీట్ చేశారు.