Siddharth: మళ్లీ తెలుగులోకి వస్తున్నా... మీ ఆశీస్సులు కావాలి: సిద్ధార్థ్

Hero Siddharth seeks blessings of Telugu audience
  • సుదీర్ఘ కాలం తర్వాత టాలీవుడ్ లో సిద్ధార్థ్ రీఎంట్రీ
  • చివరిగా 'జబర్దస్త్' చిత్రంలో హీరోగా నటించిన సిద్ధార్థ్
  • తాజాగా 'మహాసముద్రం'లో  లీడ్ రోల్
హీరో సిద్ధార్థ్ మళ్లీ తెలుగు చిత్రసీమలో నేరుగా ఓ చిత్రం చేస్తున్నాడు. 'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి డైరెక్షన్ లో 'మహాసముద్రం' అనే చిత్రంలో శర్వానంద్ తో కలిసి నటిస్తున్నాడు. సిద్ధార్థ్ చాన్నాళ్ల తర్వాత చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. చివరిసారిగా తెలుగులో సిద్ధూ హీరోగా నటించిన చిత్రం 'జబర్దస్త్'. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా 2013లో వచ్చింది. సిద్ధార్థ్ అదే ఏడాది 'బాద్ షా' చిత్రంలో నటించినా అది కీలక పాత్ర మాత్రమే. అప్పటి నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నాడు.

తాజాగా, 'మహాసముద్రం'తో రీఎంట్రీ ఇస్తున్న సిద్ధార్థ్ తెలుగు ప్రేక్షకుల ఆశీస్సులు కోరుకుంటున్నాడు. ఎనిమిదేళ్ల అనంతరం మళ్లీ ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్నానని తెలిపాడు. వచ్చే నెల నుంచి సెట్స్ పై అడుగుపెడుతున్నానని, అద్భుతమైన టీమ్ తో పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాని వెల్లడించాడు. మళ్లీ తెలుగులోకి వస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. శర్వానంద్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ పోషిస్తున్న 'మహాసముద్రం' చిత్రంలో అదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు.
Siddharth
Tollywood
Audience
Re Entry
Maha Samudram

More Telugu News