ఈసారి గాంధీ, నెహ్రూలను టార్గెట్ చేసిన కంగనా రనౌత్

31-10-2020 Sat 14:13
  • సర్దార్ పటేల్ నిజమైన ఉక్కు మనిషి
  • ప్రధాని పదవిని బలహీనుడైన నెహ్రూకి త్యాగం చేశారు
  • నెహ్రూని గాంధీ కావాలనే ఎంచుకున్నారు
Kangana Ranaut says Sardar Patel sacrificed his position

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ సారి ఏకంగా మహాత్మాగాంధీ, దివంగత ప్రధాని నెహ్రూలపై విమర్శలు గుప్పించింది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేట్ జయంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ, పటేల్ ఒక నిజమైన ఉక్కు మనిషని కితాబునిచ్చింది.

 దేశం కోసం స్వచ్చందంగా తన పదవినే త్యాగం చేసిన మహనీయుడని చెప్పింది. భారత్ కు తొలి ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ... బలహీనుడైన నెహ్రూకు ఆ పదవిని త్యాగం చేశారని తెలిపింది. అఖండ భారతాన్ని దేశానికి అందించింది పటేల్ అని వ్యాఖ్యానించింది.

పటేల్ వంటి ఉక్కు మనిషిని కాదని... బలహీనుడైన నెహ్రూను గాంధీ కావాలనే ఎంచుకున్నారని కంగనా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నెహ్రూను ముందు ఉంచి తనకు నచ్చినట్టుగా కథను నడిపించేందుకు గాంధీ ఈ విధంగా చేసి ఉండొచ్చని వ్యాఖ్యానించింది. అయితే, గాంధీ మరణం తర్వాత దేశ పరిస్థితి ఘోరంగా తయారైందని చెప్పింది. గాంధీ చేసిన పనికి పటేల్ బాధ పడకపోయినప్పటికీ... దేశం మాత్రం దశాబ్దాలుగా బాధ పడుతోందని తెలిపింది.

పటేల్ కంటే నెహ్రూ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారనే ఒకే ఒక కారణంతో నెహ్రూని గాంధీ ప్రధానిని చేశారని వ్యాఖ్యానించింది. విడివిడిగా ఉన్న 562 రాచరిక వ్యవస్థలను, సంస్థానాలను ఏకం చేసి, అఖండ భారతాన్ని నిర్మించిన ఘనత పటేల్ దని, ఆయన మనందరికీ ఆదర్శనీయుడు, స్ఫూర్తి ప్రదాత అని కితాబునిచ్చారు. మరోవైపు, కంగనా వ్యాఖ్యలతో దుమారం రేగింది. కాంగ్రెస్ శ్రేణులు ఆమెపై విరుచుకుపడుతున్నాయి.