తంటికొండ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్

30-10-2020 Fri 13:14
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం
  • వ్యాన్ బోల్తా పడి ఏడుగురి మృతి
  • ప్రమాద వార్త తనను కలచివేసిందన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan shocked after seven died in Thantikonda mishap

తూర్పుగోదావరి జిల్లా తంటికొండ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద జరిగిన ప్రమాదంపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంటికొండ ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించారన్న వార్త కలచివేసిందని తెలిపారు. ఎంతో ఆనందంగా పెళ్లివేడుకకు వెళ్లి తిరిగి వస్తున్నవారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.

మృతుల కుటుంబాలకు తన తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరుతున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన సాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో ఓ పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా వ్యాన్ బోల్తా పడిన ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తెలిసిందే.