సంపూర్ణ మద్య నిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదు... ఏపీలోనూ అంతే!: రఘురామకృష్ణరాజు

29-10-2020 Thu 20:29
  • ఏపీ మద్యం పాలసీపై రఘురామ వ్యాఖ్యలు
  • రాష్ట్ర ప్రజల శ్రమను దోచుకుంటున్నారని విమర్శలు
  • ఏపీలో అక్రమ మద్యం ఏరులై ప్రవహిస్తోందని వెల్లడి
MP Raghurama Krishnaraju slams AP Government over liquor policy

ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఢిల్లీలో రచ్చబండ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శ్రమను కొందరు మద్యం వ్యాపారులు దోచుకుంటున్నారని ఆరోపించారు. ముగ్గురు వ్యక్తుల మద్యం వ్యాపారాన్ని పెంచడానికే ప్రస్తుత మద్యం విధానం ఉపయోగపడుతోందని విమర్శించారు. కల్తీ మద్యం, నాసిరకం బ్రాండ్లతో ప్రజల రక్తం తాగే వ్యాపారులపై సీఎం జగన్ చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు.  

సంపూర్ణ మద్య నిషేధం దేశంలో ఎక్కడా సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం కారణంగా అక్రమ రవాణా ఎక్కువైందని, దాంతో తక్కువ ఆదాయం కలిగిన అక్కడి ప్రజలు భారీగా నష్టపోతున్నారని వివరించారు. తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుండడంతో ప్రస్తుత ప్రభుత్వానికి ఈసారి ఓటు వేయకూడదని బీహార్ మహిళలు నిర్ణయించుకున్నారని తెలిపారు. ఏపీలోనూ అదే పరిస్థితి రావొచ్చని అన్నారు.

ఏపీలో అక్రమ మద్యం ఏరులై ప్రవహిస్తోందని అన్నారు. అనధికార బెల్ట్ షాపులు ఎక్కువయ్యాయని తెలిపారు. పక్క రాష్ట్రం నుంచి నాణ్యమైన మద్యం తెచ్చుకునే ప్రజలను కేసుల పేరిట వేధించడం సరికాదని ఏపీ ప్రభుత్వానికి హితవు పలికారు.