Vexus Syndrome: పురుషుల్లో మాత్రమే కనిపించే కొత్త రకం సిండ్రోమ్ ను గుర్తించిన పరిశోధకులు!

  • అమెరికా పరిశోధకుల ఆసక్తికర అధ్యయనం
  • జన్యువైవిధ్యం ఉన్నవారిలో సిండ్రోమ్ ఏర్పడే అవకాశాలు
  • 2,500 మంది జన్యుశ్రేణిపై పరిశోధన
US researchers find a new syndrome

అమెరికాకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్), నేషనల్ హ్యూమన్ జీనోమ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ హెచ్ జీఆర్ఐ) పరిశోధకులు ఓ కొత్తరకం సిండ్రోమ్ ను గుర్తించారు. దీన్ని వెక్సాస్ సిండ్రోమ్ గా పేర్కొంటున్నారు. ఇది పురుషుల్లో మాత్రమే కనిపిస్తుందని పరిశోధకులంటున్నారు. సిరల్లో రక్తం గడ్డకట్టడం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, తరచుగా జ్వరం, మైలోయిడ్ కణజాలంలో ఖాళీ ఏర్పడడం ఈ సిండ్రోమ్ లక్షణాలు.

పురుషుల రక్తకణాల్లో జన్యుపరమైన వైవిధ్యం ఉన్నవారిలో ఈ సిండ్రోమ్ ఏర్పడుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధన కోసం 2,500 జన్యుశ్రేణిపై అధ్యయనం చేపట్టారు. వారిలో యూబీఏ1 అనే జన్యువు కలిగి ఉన్నవారు ఈ వెక్సాస్ సిండ్రోమ్ లక్షణాలకు గురవుతారని తేల్చారు. యూబీఏ1 జన్యువు చాలా అరుదైనదే కాకుండా దుష్ప్రభావాలు కలిగించే జన్యువు అని పరిశోధకులు వెల్లడించారు.

అన్ని జన్యువులు జతలుగా ఉంటే, ఇది మాత్రం ఒక్కటే ఉంటుందాని వెల్లడైంది. ఇది ఎక్స్ క్రోమోజోమ్ లో ఉంటుంది. సాధారణంగా పురుషుల్లో ఎక్స్, వై క్రోమోజోములు ఉంటాయి. మహిళల్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ వుంటాయి. ఇది ఎక్స్ క్రోమోజోమ్ తో ఉత్పరివర్తనం చెందుతోంది.

దీంతో పురుషుల్లో ఒకటే ఎక్స్ క్రోమోజోమ్ ఉండడంతో తేలికగా ఉత్పరివర్తనం చెందుతుండగా, మహిళలలో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండడం వల్ల ఉత్పరివర్తనం చెందడం కష్టమవుతోందని, ఆ విధంగా ఒక ఎక్స్ క్రోమోజోమ్ మహిళలకు రక్షణగా నిలిచి, వారిని ఈ సిండ్రోమ్ బారిన పడకుండా చేస్తోందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

ఈ యూబీఏ1 జన్యువు ఉత్పరివర్తనం చెందితే వెక్సాస్ సిండ్రోమ్ లక్షణాలు కనిపిస్తాయని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ బెక్ వెల్లడించారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ఈ అధ్యయనం తాలూకు వివరాలు ప్రచురించారు.

More Telugu News