ఇలాంటి సినిమాలలో భాగం కావడానికి ఇష్టపడతాను: జగపతిబాబు

29-10-2020 Thu 19:53
  • 'కలర్ ఫొటో' సినిమా అద్భుతంగా ఉంది
  • ఇంత సహజసిద్ధంగా ఉన్న సినిమాను చూసి ఆశ్చర్యపోయాను
  • సినిమా హిట్ కావడానికి స్టార్ డమ్ అవసరం లేదని నిరూపించారు
I like to act in these kind of movies says Jagapathi Babu

ఇటీవలే ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలైన 'కలర్ ఫోటో' చిత్రం అందరి మన్ననలు పొందుతోంది. సాయిరాజేశ్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాతలుగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలను సైతం పొందుతోంది. రవితేజ, విజయ్ దేవరకొండ, నాని, మారుతి వంటి వారు ఇప్పటికే ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాజాగా జగపతిబాబు ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఈ సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఈ సినిమా చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని చెప్పారు.

దర్శకుడు సందీప్ తను ఏంటో నిరూపించుకున్నాడని జగపతిబాబు అన్నారు. సుహాన్ ఒక నటుడిగానే కాకుండా, ఒక హీరోగా కూడా నిరూపించుకున్నాడని ప్రశంసించారు. సినిమా హిట్ కావడానికి స్టార్ డమ్, భారీ బడ్జెట్ మాత్రమే కారణం కాదని ఈ చిత్రం నిరూపించిందని అన్నారు. నటీనటులు, టెక్నీషియన్లు అందరూ కలిసి ఇలాంటి సహజసిద్ధమైన చిత్రాన్ని తీయడం చూస్తూ ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. ఇలాంటి మంచి సినిమాలలో భాగం కావడానికి తాను ఇష్టపడతానని అన్నారు.  చిన్న హీరోల సినిమాలలో తాను నటించనని, తనకు అంత రెమ్యునరేషన్ ఇచ్చుకోలేమనే భావనతో వారు తనను సంప్రదించడం లేదని... ఈ రెండింటిలో నిజం లేదని అన్నారు.