నాపై అత్యాచారం చేసి చంపేసి ఉండేవారు.. ఎల్జేపీ అభ్యర్థి ప్రకాశ్‌చంద్రపై బాలీవుడ్ నటి అమీషా సంచలన ఆరోపణలు

29-10-2020 Thu 10:09
  • ప్రకాశ్‌చంద్రకు మద్దతుగా ప్రచారం
  • తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన
  • ముంబై వచ్చాక కూడా వేధింపులు ఆగలేదన్న నటి
 Could Have Been Raped and killed Killed says Ameesha Patel

బీహార్‌లోని ఓబ్రా నియోజకవర్గం నుంచి ఎల్జేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న డాక్టర్ ప్రకాశ్‌చంద్రపై బాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎన్నికల ప్రచారం కోసం అమీషా పటేల్ ఈ నెల 26న ఓబ్రా వెళ్లారు. ముందుగా చెప్పినట్టు కాకుండా తనతో రెండు గంటలపాటు అధికంగా ప్రచారం చేయించారని ఆరోపించిన అమీషా.. ప్రచారంలో ప్రకాశ్ చంద్ర తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. తనను బ్లాక్‌మెయిల్ చేశాడని పేర్కొంది.

తాను ముంబై చేరుకున్న తర్వాత కూడా ఆయన నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వచ్చాయని, ఆయన గురించి గొప్పగా మాట్లాడాలని బెదిరించారని ఆరోపించింది. ప్రచారంలో ఉండగా ఓ గ్రామంలో తనను వదిలేసిన ప్రకాశ్ చంద్ర.. తనతో కలిసి రాకుంటే అక్కడే ఒంటరిగా వదిలేస్తానని హెచ్చరించాడని పేర్కొంది. అతడి కారణంగా తాను విమానం మిస్సయ్యానని ఆవేదన వ్యక్తం చేసింది.

తాను అక్కడ ప్రాణభయంతో విలవిల్లాడిపోయానని, తనపై అత్యాచారం చేసి, చంపేసి ఉండేవారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకాశ్ చంద్ర మద్దతుదారులు తన కారును చుట్టుముట్టి కదలకుండా అడ్డుకున్నారని, ఆయన తనను ట్రాప్ చేశాడని, తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశాడని అమీషా ఆరోపించింది. ప్రచారంలో ఏ జరిగిందో నిజం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ విషయాలను వెల్లడిస్తున్నట్టు చెప్పింది.