హైదరాబాద్‌లో పట్టపగలే కిడ్నాప్.. బురఖాల్లో వచ్చి డాక్టర్‌‌ను అపహరించిన దుండగులు

28-10-2020 Wed 07:44
  • రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • క్లినిక్‌లోకి ప్రవేశించి వైద్యుడిని కొట్టి లాక్కెళ్లిన నిందితులు
  • ఆస్తి తగాదాలే కారణం కావొచ్చని అనుమానిస్తున్న పోలీసులు
Dentist kidnapped in Hyderabad rajendranagar

హైదరాబాద్‌లో పట్టపగలు ఓ డాక్టర్‌ను కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ జాగీర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దంత వైద్యుడైన బెహజత్ హుస్సేన్ (57) ఎక్సైజ్ అకాడమీ సమీపంలోని ప్రెస్టీజ్ విల్లాస్ లో నివసిస్తున్నారు. అక్కడికి సమీపంలోనే మరో భవనంలో క్లినిక్ నిర్వహిస్తున్న ఆయన రోజు లానే నిన్న మధ్యాహ్నం భోజనం కోసం క్లినిక్ నుంచి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

అదే సమయంలో బురఖాలు ధరించిన కొందరు వ్యక్తులు క్లినిక్ లోపలికి ప్రవేశించారు. వైద్యుడి వ్యక్తిగత సహాయకుడు సయ్యద్ సల్మాన్‌ను కొట్టి నోటికి ప్లాస్టర్ వేశారు. కాళ్లు, చేతులు కట్టి బాత్రూంలో పడేశారు. అనంతరం వైద్యుడిపైనా చేయిచేసుకున్న దుండగులు బయట కారు వద్దకు ఆయనను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి బలవంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని శంకర్‌పల్లి రోడ్డువైపుగా వెళ్లారు.

కాసేపటికి దుండగులు కట్టిన తాళ్లను తెంపుకున్న సయ్యద్.. వైద్యుడి ఇంట్లోనే పనిచేసే తన తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న హుస్సేన్ భార్య 100 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడి సీసీటీవీ పుటేజీలను పరిశీలించారు. నిన్న రాత్రి వరకు వైద్యుడి ఆచూకీ గురించి ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయితే, ఈ కిడ్నాప్‌నకు ఆస్తి వ్యవహారాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.