మరోసారి ట్రంప్ గెలిస్తే అంతే సంగతులు: హిల్లరీ క్లింటన్

27-10-2020 Tue 16:48
  • ఈ నాలుగేళ్లలో అమెరికాను దిగజార్చారు
  • ట్రంప్ గెలుస్తాడనే ఆలోచన వస్తేనే కడుపులో తిప్పినట్టు అనిపిస్తుంది
  • బైడెన్ గెలుస్తారనే విషయంలో సందేహం లేదు
I have confidence on Bidens win says Hillary Clinton

మరో వారం రోజుల్లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మరోసారి ట్రంప్ కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా పని అయిపోయినట్టేనని అన్నారు. ఈ నాలుగేళ్లలో దేశాన్ని ఎంతో దిగజార్చారని... మరో నాలుగేళ్లు అధికారాన్ని అప్పగిస్తే దేశం మరింత దిగజారడం ఖాయమని అన్నారు. మరోసారి ట్రంప్ గెలుస్తాడనే ఆలోచన వస్తేనే కడుపులో తిప్పినట్టు అనిపిస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఈసారి డెమొక్రాటిక్ అభ్యర్థి బైడెన్ గెలుస్తారనే విషయంలో ఎలాంటి సందేహం లేదని హిల్లరీ ధీమా వ్యక్తం చేశారు. బైడెన్, కమలా హ్యారిస్ ఇద్దరూ గెలుపొందాలని ఆకాంక్షించారు. కమలాతో చాలా సార్లు మాట్లాడానని... ఆమె ఒక శక్తిమంతమైన మహిళ అని అన్నారు. డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చినా తనకు ఎలాంటి పదవి అవసరం లేదని చెప్పారు. ట్రంప్ అధికారంలోకి రాకూడదనేదే తన తపన అని అన్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ పై ట్రంప్ గెలుపొందారు. హిల్లరీకి పాప్యులర్ ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ... ఎలెక్టోరల్ ఓట్లు మాత్రం ట్రంప్ కు ఎక్కువగా వచ్చాయి.