ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి ఏం ప్రయోజనం? మీ అసమర్థతతో పోలవరంను చంపేశారు: జగన్ పై అచ్చెన్నాయుడు ఫైర్

27-10-2020 Tue 16:09
  • చంద్రబాబుకు పేరొస్తుందని పోలవరంను చంపేశారు
  • పోలవరంకు జగన్ నిధులను సాధించలేకపోయారు
  • అనిల్ కుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
Jagan killed Polavaram project says Atchannaidu

పోలవరం ప్రాజెక్ట్ పూర్తైతే చంద్రబాబుకు పేరొస్తుందనే ఈర్ష్యతో ప్రాజెక్టును చంపేశారని ముఖ్యమంత్రి జగన్ పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి అని తెలిసి కూడా దాన్ని చంపేశారని మండిపడ్డారు. ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన జగన్ సాధించింది ఏముందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని... 71 శాతం పనులను శరవేగంతో పూర్తి చేసిందని చెప్పారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 55 వేల కోట్లకు రాజ్యసభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం తన చేతకాని తనంతో ప్రాజెక్టు నిధులను కూడా సాధించలేకపోయిందని చెప్పారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఏమాత్రం అవగాహన లేదని... ఏది తోస్తే అది మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అసమర్థతతో పోలవరం ఆగిపోయిందని విమర్శించారు. టీడీపీ హయాంలో అభివృద్ధి దిశగా దూసుకుపోయిన ఏపీ... ఇప్పుడు తిరోగమనంలో పయనిస్తోందని అన్నారు.