బాబూ చిట్టీ.. నువ్వు ట్రాక్టర్‌ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా?: విజయసాయిరెడ్డి ఎద్దేవా

27-10-2020 Tue 10:16
  • పశ్చిమ గోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటన
  • ఫొటో పోస్ట్ చేసి విజయసాయిరెడ్డి చురకలు
  • నువ్వు ఎక్కిన ట్రాక్టర్‌ గుంతలో పడిందా? అంటూ ప్రశ్న
  • ప్లీజ్‌ చెప్పు! అంటూ ఎద్దేవా
vijay sai reddy mocks lokesh

పశ్చిమ గోదావరి జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నేత నారా లోకేశ్ పర్యటించారు.  ఉండి నియోజకవర్గం, సిద్ధాపురం గ్రామంలోని చాకలి పేటలో నీట మునిగిన ఇళ్లను పరిశీలించానని, ఇంట్లో అడుగు మేర పేరుకుపోయిన బురద, బయట చెరువును తలపిస్తోన్న రోడ్లతో ప్రజల బాధలు వర్ణనాతీతమని ఆయన చెప్పారు. ప్రభుత్వం ముంపు గురించి కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ఉన్నదంతా నీటిపాలై కట్టుబట్టలతో మిగిలామని కళింగపేట గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారని అన్నారు.  వారికి కాస్తంత ధైర్యం చెప్పిన అనంతరం తణుకు వెళ్లానని అన్నారు.

అయితే, ఈ సందర్భంగా గుంతలో ట్రాక్టర్ చిక్కుకున్న ఫొటోను పోస్ట్ చేస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ‘బాబూ... చిట్టీ (లోకేశం)! ఇంతకీ నువ్వు ఎక్కిన ట్రాక్టర్‌ గుంతలో పడిందా... లేక నువ్వు ట్రాక్టర్‌ ఎక్కడం వల్ల భూమిలో గుంత పడిందా? ప్లీజ్‌ చెప్పు!’ అని విజయసాయిరెడ్డి చురకలంటించారు.