బిర్లా వారసురాలికి అమెరికాలో చేదు అనుభవం

26-10-2020 Mon 17:24
  • ఓ రెస్టారెంటులో తమను గెంటివేసినంత పనిచేశారన్న అనన్య బిర్లా
  • భోజనానికి 3 గంటలు వేచిచూడాల్సి వచ్చిందని వెల్లడి
  • జాతి వివక్ష వైఖరి అంటూ ఆగ్రహం
Ananya Birla fires on a California restaurant

ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లాకు అమెరికాలో ఊహించని అనుభవం ఎదురైంది. ఓ రెస్టారెంటులో ప్రవేశానికి అనన్య బిర్లా 3 గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. అంతేకాదు, అక్కడి సిబ్బంది జాత్యహంకార ప్రవర్తనతో దిగ్భ్రాంతికి గురయ్యారు.

అనన్య బిర్లా తన కుటుంబ సభ్యులతో కలిసి కాలిఫోర్నియాలోని ప్రముఖ ఇటాలియన్-అమెరికన్ వంటకాల రెస్టారెంట్ 'స్కోపా'కు వెళ్లారు. అయితే, ఆ రెస్టారెంటులో భోజనం చేసేందుకు అనన్య, ఆమె కుటుంబసభ్యులను అక్కడి సిబ్బంది మూడు గంటల పాటు నిరీక్షించేలా చేశారు. దీనిపై అనన్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఎంతో విచారించదగ్గ విషయం అని పేర్కొన్నారు. తమను దాదాపు గెంటివేశారని ఆరోపించారు.

స్కోపా రెస్టారెంటులోని జాషువా సిల్వర్ మాన్ అనే వెయిటర్ తన తల్లితో దురుసుగా ప్రవర్తించారని, ఇది జాతి వివక్ష పూరిత వైఖరి అని మండిపడ్డారు. కస్టమర్లతో మర్యాదగా ప్రవర్తించాలి అంటూ స్కోపా రెస్టారెంటు యాజమాన్యానికి హితవు పలికారు.

దీనిపై అనన్య తల్లి నీరజా బిర్లా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దుర్మార్గంగా కస్టమర్ల పట్ల వ్యవహరించే హక్కు మీకు లేదు అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని తెలిపారు.