బాలకృష్ణ అల్లుడికి చెందిన గీతం క్యాంపస్ లో ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకుంటే టీడీపీ వక్రీకరిస్తోంది: అమర్నాథ్

26-10-2020 Mon 16:59
  • కోర్టు ఆర్డర్ ను కూడా వక్రీకరిస్తున్నారన్న అమర్నాథ్
  • గీతం యాజమాన్యానిది భూదాహం అంటూ విమర్శలు
  • ఆక్రమిత భూములను క్రమబద్ధీకరించాలనడం సరికాదని హితవు
Gudiwada Amarnath explains Geetham management land issue

వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విశాఖపట్నంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. బాలకృష్ణ అల్లుడు భరత్ కు చెందిన గీతం విద్యాసంస్థల క్యాంపస్ లో ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ వక్రీకరిస్తోందని ఆరోపించారు. విశాఖలో ఆక్రమిత భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ప్రజలు అనేక పర్యాయాలు విజ్ఞప్తి చేశారని, గీతం ఆక్రమించిన 40 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

అయితే, గీతం విద్యాసంస్థల యాజమాన్యం, టీడీపీ అనుకూల మీడియా ఈ విషయంలో కోర్టు ఆర్డర్లను కూడా వక్రీకరించడం దారుణమని అభిప్రాయపడ్డారు. గీతం సంస్థల యాజమాన్యం తమ అధీనంలోని 43 ఎకరాల భూమిని క్రమబద్ధీకరించాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిందని, ఇప్పటికే ప్రభుత్వం నుంచి 71 ఎకరాల భూమి తీసుకుని ఉన్న ఆ సంస్థ మరింత భూమి కావాలని కోరిందని అమర్నాథ్ వివరించారు. గీతం సంస్థల యాజమాన్యం విద్యాదాహం కంటే భూదాహం ఎక్కువగా ప్రదర్శిస్తోందని విమర్శించారు.

గీతం సంస్థలు ఆక్రమించింది కోట్ల విలువైన భూములు అని, అలాంటి భూములను ఆక్రమించడమే కాక, వాటిని క్రమబద్ధీకరించాలని కోరడం సరికాదని హితవు పలికారు. గీతం సంస్థ తమ సొంత భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అట్టిపెట్టుకుందని ఆరోపించారు. ఇప్పుడు గీతం సంస్థల ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే టీడీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. గీతం నుంచి స్వాధీనం చేసుకున్న భూములను తమ ప్రభుత్వం ప్రజా అవసరాల నిమిత్తం ఉపయోగిస్తుందని అన్నారు.