పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఆర్టీఐ ద్వారా స్పష్టతనిచ్చిన కేంద్రం

26-10-2020 Mon 15:13
  • పోలవరంపై కేంద్రాన్ని ఆర్టీఐ ద్వారా వివరణ కోరిన సౌరభ్ ఖమర్
  • దరఖాస్తుకు జవాబు ఇచ్చిన కేంద్రం
  • ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు రూ.8,614.16 కోట్ల వ్యయం
Union government replies to a RTI query over Polavaram project

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై విజయవాడకు చెందిన సౌరభ్ ఖమర్ అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని వివరణ కోరగా, ఆ దరఖాస్తుకు కేంద్రం జవాబు ఇచ్చింది. తద్వారా ప్రాజెక్టు నిర్మాణం, పునరావాసం, పరిహారానికి సంబంధించిన అంశాలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేసింది. తాము ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే నిధులు ఇస్తామని కేంద్రం తన జవాబులో స్పష్టం చేసింది. పునరావాస, పరిహారం ప్యాకేజీలతో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది.

2015 నుంచి ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.8,614.16 కోట్లు ఖర్చయినట్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.950 కోట్లు, నాబార్డు ద్వారా రూ.7,664.16 కోట్లు మంజూరైనట్టు వివరించింది. పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయంలో ఇంకా రూ.2,234.77 కోట్లు పెండింగ్ లో ఉన్నట్టు తెలిపింది.

ఇప్పటివరకు పునరావాసంతో కలిపి 41.05 శాతం మేర నిర్మాణం పూర్తయినట్టు పేర్కొంది. విడివిడిగా చూస్తే... ప్రాజెక్టు నిర్మాణం 71 శాతం, పునరావాస పనులు 19.85 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం వెల్లడించింది.