గీతం యూనివర్శిటీ కట్టడాల కూల్చివేతపై నవంబర్ 30వరకు స్టే

25-10-2020 Sun 20:03
  • నిన్న తెల్లవారుజామున కూల్చివేతలు చేపట్టిన అధికారులు.
  • నోటీసులు కూడా ఇవ్వలేదని హైకోర్టును ఆశ్రయించిన గీతం యాజమాన్యం
  • కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
AP High Court Stay on GITAM University Wall Demolish

గీతం యూనివర్శిటీకి సంబంధించి కట్టడాల కూల్చివేతలపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. నవంబర్ 30వ తేదీ వరకు తదుపరి చర్యలను తీసుకోవద్దని ఆదేశించింది. ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

విశాఖలోని  గీతం విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కొన్ని కట్టడాలను నిన్న జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. నిన్న తెల్లవారుజాము నుంచే పొక్లెయిన్ లతో కూల్చివేయడం ప్రారంభించారు. ఈ సందర్భంగా 100 మందికి  పైగా పోలీసులు మోహరించారు. ఆర్డీవో పెంచలయ్య ఆధ్వర్యంలో దాదాపు 40 మంది రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు.

అయితే నోటీసులు కూడా ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ గీతం యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 30 వరకు వాయిదా వేసింది.