అనుమానమే లేదు.. ‘పోలవరం’లో అవినీతి జరిగింది: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

25-10-2020 Sun 10:36
  • సాంకేతికత పేరుతో పోలవరం అంచనాలు పెంచేశారు
  • అంచనాల పెంపుపై విచారణ జరగాలి
  • అక్రమ కట్టడాల పేరుతో ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలు
BJP MLC Madhav says there is corruption in Polavaram project

విజయదశమి సందర్భంగా నేడు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్న బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్ అనంతరం మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందన్న విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. పోలవరం అంచనాల పెంపుపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వాస్తవ అంచనాలకు అనుగుణంగానే కేంద్రం నిధులు ఇస్తుందన్నారు.

సాంకేతికత పేరుతో ప్రాజెక్టు అంచనాలను పెంచేశారన్న మాధవ్.. అంచనాల పెంపుపై విచారణ జరగాలన్న విషయాన్ని గతంలో కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. విశాఖలో గీతం యూనివర్సిటీలో అక్రమ కట్టడాల పేరుతో జరుగుతున్న కూల్చివేతలపై మాధవ్ మాట్లాడుతూ.. ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్టుగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.