గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కరోనా!

25-10-2020 Sun 10:13
  • ఇటీవల గ్రామాల్లో పర్యటించిన వంశీ
  • ఆపై తిరుమలకు వెళ్లి రాగానే అస్వస్థత
  • పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్
Vallabhaneni Vamsi Gets Corona

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు కరోనా సోకింది. ఇటీవలి కాలంలో పలు గ్రామాల్లో పర్యటించడంతో పాటు, తిరుమలకు వెళ్లి, స్వామిని దర్శించుకున్న ఆయనకు, గత కొన్ని రోజులుగా జ్వరం, జలుబు ఉంటోంది. అస్వస్థతకు గురైన ఆయన, టెస్ట్ లు చేయించుకోగా, ఆ ఫలితం నిన్న వెల్లడైంది. కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు స్పష్టం చేశారు.

దీంతో ఆయన 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వెల్లడించిన ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు, ఇటీవలి కాలంలో ఆయన్ను కలిసిన వారంతా క్వారంటైన్ కావాలని, ఎవరికైనా కరోనా లక్షణాలుంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నాయి.