సోదరుడి ఇంటి వద్ద ఉంటున్న బాలిక.. వ్యభిచార గృహానికి అమ్మేసిన వదిన

25-10-2020 Sun 09:19
  • తల్లిదండ్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో సోదరుడి వద్ద ఉంటున్న బాలిక
  • సింగరాయకొండ మహిళకు బాలికను అమ్మేసిన వదిన
  • ఇప్పటి వరకు 13 మంది అరెస్ట్
sister in law sold her husband sisters to prostitute house
తల్లిదండ్రుల మధ్య కలతల కారణంగా సోదరుడి ఇంటి వద్ద ఉంటున్న బాలికను సొంత వదినే వ్యభిచార గృహానికి అమ్మేసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నెల్లూరు జిల్లా కావలికి చెందిన బాలిక పదో తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రుల మధ్య కలత కారణంగా  సోదరుడి ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులకు దూరంగా తమ ఇంట్లో ఉంటున్న బాలికను తల్లిలా చూసుకోవాల్సిన వదిన ఈ ఏడాది జులైలో సింగరాయకొండకు చెందిన మహిళకు బాలికను విక్రయించింది.

బాలికను కొనుక్కున్న మహిళ కందుకూరు మండలంలోని ఓగూరు సమీపంలో ఆమెతో వ్యభిచారం చేయిస్తోంది. అక్కడి బాధలు భరించలేని బాలిక ఇటీవల వ్యభిచార గృహం నుంచి తప్పించుకుని పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురు వ్యభిచార గృహ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. తాజాగా, మరో 9 మంది విటులను గుర్తించి వివిధ ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు మరికొందరిని కూడా గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.