స్కూల్ పై తుపాకులతో దాడి... 8 మంది చిన్నారుల దుర్మరణం!

25-10-2020 Sun 10:25
  • స్కూల్ పై దాడికి దిగిన ఆగంతకులు
  • మరో 12 మందికి గాయాలు
  • దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అధికారులు
Attack on Camaron School 8 childrens Died

తుపాకులు తదితర ఆయుధాలతో ఓ స్కూల్ పైకి దూసుకొచ్చిన దుండగులు, విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు 8 మంది విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన సౌత్ వెస్ట్రన్ కామెరూన్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి కారణం తామేనని ఇంతవరకూ ఏ గ్రూప్ కూడా క్లయిమ్ చేసుకోలేదు. ఈ ప్రాంతంలో ఆంగ్లోఫోన్ వేర్పాటువాదులకు, ప్రభుత్వ దళాలకు మధ్య గత మూడేళ్లుగా తరచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే.

"తుపాకుల బులెట్ల కారణంగా కనీసం ఎనిమిది మంది చిన్నారులు మరణించారు. ఈ ఘటనతో మదర్ ఫ్రాన్సిస్కా ఇంటర్నేషనల్ బైలింగువల్ అకాడమీ రక్తసిక్తమైంది" అని యూఎన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇదే ఘటనలో మరో 12 మంది విద్యార్థులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించామని వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంతవరకూ ఇంతటి ఘోరమైన ఘటన జరగలేదని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా 2017 నుంచి సుమారు 7 లక్షల మంది తమ ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. ఈ దాడికి ఫలానా వారు కారణమని అధికారులు కూడా ఇంతవరకూ చెప్పలేకపోవడం గమనార్హం.