కరోనా నుంచి కోలుకున్న వారిలో 7 నెలల వరకు యాంటీబాడీలు

25-10-2020 Sun 08:33
  • యాంటీబాడీల వృద్ధి పురుషులతో పోలిస్తే మహిళల్లో తక్కువ
  • వైరస్ నుంచి ప్రమాదం పొంచి ఉన్న వెంటనే యాంటీబాడీల ఉత్పత్తి
  • పోర్చుగల్ ఐఎంఎం పరిశోధనలో వెల్లడి
Antibodies in human body live for seven months

కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారిలో 7 నెలల వరకు యాంటీబాడీలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీబాడీల స్థాయికి, వయసుకు ఎటువంటి సంబంధం లేదని, కాకపోతే మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే యాంటీబాడీలు ఎక్కువగా వృద్ధి చెందుతున్నట్టు పోర్చుగల్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ మాలిక్యులర్ (ఐఎంఎం) నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. ఈ అధ్యయన వివరాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఇమ్యునాలజీలో ప్రచురితమయ్యాయి.

శరీరంలో వృద్ధి చెందుతున్న యాంటీబాడీల స్థాయిలో వైరస్ తీవ్రత కూడా ఉన్నట్టు వీరు గుర్తించారు. వైరస్ ఎక్కువగా ఉన్న కేసుల్లో యాంటీబాడీల స్థాయి ఎక్కువగా ఉండడం గమనార్హం. వైరస్ నుంచి ప్రమాదం ముంచుకొస్తుందన్న విషయాన్ని గుర్తించిన వెంటనే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుందని, ఇవి వైరస్‌పై పోరాడడానికి ఎంతగానో దోహదం చేస్తాయని పరిశోధనకు సారథ్యం వహించిన డాక్టర్ వోల్దెయెన్ వివరించారు.

పురుషులతో పోలిస్తే యాంటీబాడీల వృద్ధి మహిళ్లలో కొంచెం తక్కువగా ఉన్నట్టు గుర్తించిన పరిశోధకులు.. వైరస్ లక్షణాలు బయటపడిన తొలి మూడు వారాల్లో యాంటీబాడీల పెరుగుదల గణనీయంగా పెరిగి ఆ తర్వాత మధ్యస్త స్థాయికి తగ్గిపోతున్నట్టు తెలిపారు. స్త్రీ, పురుషుల్లో యాంటీబాడీల వృద్ధిలో తేడాలున్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలోనూ అవి ఒకే స్థాయికి పడిపోతున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ రోగ నిరోధక శక్తి విశ్లేషణను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ పరిశోధన ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.